ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిర్ణయం సరైనదైతే ప్రజాతీర్పు తీసుకోడానికి భయమెందుకు?: తెదేపా

మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంపై తెదేపా నేతలు మండిపడ్డారు. తాము తీసుకున్న నిర్ణయం సరైనదే అయితే ప్రజా తీర్పు కోరడానికి ఎందుకు జంకుతున్నారని బొండా ఉమ, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

tdp leaders criticises ycp government
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతల విమర్శలు

By

Published : Aug 6, 2020, 3:16 PM IST

వైకాపా ప్రభుత్వం 5 కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తోందంటూ తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమ అన్నారు. 3 రాజధానులపై ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామని తాము సవాల్ చేస్తే.. దానిపై సీఎం జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వ్యక్తిగత కక్షతోనే జగన్ అమరావతి నిర్మాణాన్ని నిలిపివేశారని ఆరోపించారు. రూ. 10వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన రాజధానిని తమ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం నాశనం చేస్తున్నారని విమర్శించారు. 14 నెలల పాలనలో ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ఏం చేసిందని నిలదీశారు. లక్షకోట్లు అప్పుతెచ్చి నామమాత్రంగా పేదలకు పంచి, మిగిలిన నిధులు మింగేశారని మండిపడ్డారు. 30ఏళ్లపాటు జగనే అధికారంలో ఉంటారని అంటున్న ఆ పార్టీ నేతలు అమరావతిపై ప్రజల తీర్పు కోరడానికి ఎందుకు జంకుతున్నారన్నారు.

ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండి

విభజన చట్టం-2014 ప్రకారం ఏర్పడిన రాజధానిని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆక్షేపించారు. ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రంలో ఇంటర్నల్ యాగ్రషన్ ఉందని.. దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సింది కేంద్రమేనని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంపై ఈ ప్రభుత్వానికి విశ్వాసం ఉంటే మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం కోరాల్సిందేనని డిమాండ్ చేశారు. శాసనాలకు, న్యాయవ్యవస్థకు, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాలకులకు దమ్ము, ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌చేశారు.

ఇవీ చదవండి...

రాజధానిలో పెట్టింది ప్రజల సొమ్ము.. ఖజానాకు నష్టం కదా..: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details