రాష్ట్ర ఆర్థిక శాఖలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై యనమల రామకృష్ణుడు 5 పేజీల ప్రకటన విడుదల చేశారు. మంత్రివర్గం చేసిన తప్పిదాలకు ఉద్యోగులను బాద్యులను చేసి శిక్ష వేయడాన్ని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులకు మంత్రివరం ట్రస్టీలే తప్ప యజమానులు కాదనే విషయం గుర్తించాలన్నారు. ప్రజాధనం ఖర్చు చేసేందుకు నిబంధనలుంటాయని.. నిధుల్ని ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేస్తే వాస్తవాలు బహిర్గతం చేసేందుకు భయమెందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చుల్లో పారదర్శకత లేకపోవటం వల్లే రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నారు.
రుణ సంక్షోభానికి తెదేపా ప్రభుత్వం చేసిన అప్పులే కారణమన్న ఆర్థికమంత్రి బుగ్గన వ్యాఖ్యలను యనమల కొట్టిపడేశారు. ముఖ్యమంత్రి, సహచర మంత్రుల అవినీతి, దుబారా కారణంగానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని ఆక్షేపించారు. తెలుగుదేశం పాలనలో రూ. లక్షా 30వేల కోట్ల అప్పు చేస్తే వైకాపా ప్రభుత్వం 25 నెలల్లోనే రూ. లక్షా 49 వేల కోట్ల అప్పు చేసిందన్నారు. కార్పొరేషన్ల ద్వారా మరో రూ. 34,650 కోట్లు రుణాలు సమీకరించారని వెల్లడించారు. తెలుగుదేశం పాలనలో ఏటా సగటున 26వేలకోట్ల రుణాలు తీసుకుంటే.. జగన్ ప్రభుత్వం సంవత్సరానికి 50 వేల కోట్లు అప్పు చేయటంతో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాల రూపేణా మరో 34వేల కోట్లు సమీకరించిందని యనమల వివరించారు. ఈ నిధులన్నీ ఉత్పాదక కార్యక్రమాల కోసం ఖర్చు చేయలేదన్న యనమల.. వైకాపా పాలనలో ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని మండిపడ్డారు.