ప్రభుత్వ వ్యవహార శైలి.. దళిత వ్యతిరేక విధానాలపై, ఎస్సీ నాయకులంతా కలసి కట్టుగా పోరాడాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పిలుపునిచ్చారు. అసత్య మాటలు, అసాధ్య వాగ్దానాలతో ఎస్సీల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి వారిపైనే వైకాపా ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఎస్సీ నాయకులకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు.
ఎస్సీలకు పారిశ్రామిక రాయితీల్లో కోత, ఉపప్రణాళిక నిధుల నిర్వీర్యం, అసైన్డు భూములు బలవంతంగా లాక్కోవటం, భూ కొనుగోళ్ల పథకాన్ని నీరుగార్చటం వంటి చర్యలకు వైకాపా ప్రభుత్వం పాల్పడిందని మండిపడ్డారు. అంబేడ్కర్ విదేశీ విద్య రద్దు, ఎస్సీలు అధికంగా ఉన్న అమరావతి నుంచి రాజధాని తరలింపుతోపాటు వైద్యుడు సుధాకర్, లక్ష్మీ అపర్ణ, జడ్జి రామకృష్ణ, వరప్రసాద్ ల పట్ల అవమానకర సంఘటనలను ప్రస్తావించారు. ప్రభుత్వ విధానాల వల్ల కొందరు వివిధ కారణాలతో చనిపోయారన్న వర్ల.. వీటన్నిటి పట్ల ఎస్సీ నాయకులు స్పందిచకపోవటం సబబు కాదని లేఖలో పేర్కొన్నారు.