విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని చీకటిమయం చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు(tdp leader kala venkat rao serious over power cuts and power shortage) ధ్వజమెత్తారు. అసమర్థత, అవినీతితో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు యూనిట్ కరెంటును రూ. 20 కి కొనుగోలు చేసే దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని విమర్శించారు. రైతు రాజ్యం పేరిట.. కరెంటు కోతల రాజ్యం తెచ్చారని ఎద్దేవా చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు ఏపీలోనే అధికంగా ఉంటే పరిశ్రమలెలా వస్తాయని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థలకు రూ. 12 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ట్రూ అప్ ఛార్జీల పేరిట ఆ భారాన్ని ప్రజలపై మోపటం తగదని హితవు పలికారు.
సొంత సంస్థల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోళ్లు..
తెదేపా ప్రభుత్వం హయాంలో రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేసుకున్న సౌర, పవన విద్యుత్ ఒప్పందాలను.. అధికారంలోకి రాగానే రద్దు చేసిన ఫలితమే విద్యుత్ కోతలకు కారణమని అన్నారు. సీఎం జగన్ రెడ్డి బినామీ పేర్లతో సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నడుపుతున్న విద్యుత్ కేంద్రాల నుంచి యూనిట్ విద్యుత్ రూ. 20 కి కొనుగోలు చేస్తూ.. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మూసివేసే దిశగా తీసుకెళ్లారని మండిపడ్డారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు బదులుగా ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయటం వెనుక తాడేపల్లి చీకటి వ్యాపారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.