సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలను కేటాయించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కడప జిల్లా బద్వేల్ లో 17 గ్రామాలు, గుంటూరు జిల్లా నరసరావుపేటలో 42 గ్రామాలు, తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడులో 23 గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించాలని లేఖలో కోరారు.
'తమ్మినేని అధికార దుర్వినియోగం'
స్పీకర్ తమ్మినేని సీతారాం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తొగరాం గ్రామంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అశోక్ బాబు ఆరోపించారు. వైకాపా నాయకులు ప్రజాస్వామ్యాన్ని కాలరాసి గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారని అన్నారు.
'వైకాపాకు వత్తాసు పలుకుతున్న సీఐ'
చిత్తూరు జిల్లా నగరిలో సీఐ అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ తెదేపా శ్రేణులను బెదిరిస్తున్న విషయాన్ని ఆడియో క్లిప్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన విషయాన్ని వివరించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోడం మండలంలో నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
'భయబ్రాంతులకు గురిచేస్తున్నారు'
కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కంచర్ల గ్రామంలో తెదేపా బలపరచిన సర్పంచ్ అభ్యర్థి వాహనాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని అశోక్ బాబు లేఖలో ప్రస్తావించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో నామినేషన్ సమయంలో అధికార పార్టీ నాయకులు ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రమాదం ఉన్నందున తగిన భద్రత కల్పించాలని కోరారు.
ఇదీ చదవండి:
పెద్దిరెడ్డిపై ఎస్‌ఈసీ నిఘా ఉంచాలి: వర్ల రామయ్య