తెదేపా పారిశ్రామిక విధానం పారదర్శకంగా లేదని మంత్రి పేర్కొనడం అబద్ధమని తెదేపా నేతలు మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో పారిశ్రామిక రంగానికి సంబంధించి మంత్రి గౌతంరెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ జరిగింది. వైకాపా నేతలు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని నేతలు మండిపడ్డారు. అవినీతి రహిత ఒప్పందాలు చేయడం తమ ప్రభుత్వ విధానమైతే..క్విడ్ ప్రో కో వైకాపా విధానమని విమర్శించారు.
అన్నీ రివర్సే!
కియా కార్ల తయారీ పరిశ్రమ తమ రాష్ట్రానికి వస్తే దాని అనుబంధ సంస్థల కంపెనీలను బయటకు పంపడమే వైకాపా లక్ష్యమని తెదేపా నేతలు ఆక్షేపించారు. వైకాపా నేతలకు అత్యంత ప్రియమైన పదం రివర్స్ అని ఎద్దేవ చేశారు. టెండర్లు, పరిపాలన, పెట్టుబడులు, పారిశ్రామికీకరణలలోనూ రివర్సేనాని విమర్శించారు. సులభతర వాణిజ్యంలో నెంబర్ వన్ రాష్ట్రాన్ని రివర్స్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.