తెదేపా పాలనలో అమలైన సంస్కరణలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఏపీ విద్యుత్ రంగాన్ని సీఎం జగన్ తన విధ్వంసక విధానాలతో సంక్షోభంలోకి నెడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ప్రజలకు వేసవి షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం తక్షణమే తమ నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్‌పై మాట తప్పి మోటార్లకు మీటర్లు బిగించినందుకు, కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపినందుకు, మిగులు విద్యుత్‌తో తెదేపా ప్రభుత్వం అప్పగించిన విద్యుత్ ఉత్పత్తిని.. లోటు విద్యుత్ స్థాయికి దిగజార్చినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. జగన్ రెడ్డి మాట ఇచ్చాడంటే.., దానికి రివర్స్ చేస్తాడనే విషయం మరోసారి రుజువైందని దుయ్యబట్టారు. సీఎం జగన్ మాట తప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్, మడమ తిప్పుడుకి ఐకాన్ అని ఎద్దేవా చేశారు.
ఇది పాలనా వైఫల్యమే..:ఏడోసారి విద్యుత్ ఛార్జీలు పెంచిన వైకాపా సర్కార్ పేదలపై భారం మోపిందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. కరెంటు కోతలతో జనం అల్లాడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన జగన్.. నేడు షాక్ కొట్టేలా విద్యుత్ ఛార్జీలను పెంచారని ధ్వజమెత్తారు. ఒక పక్క ఎండలు మండుతుంటే.. విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాలని చెప్పడం ఆయన పాలనా వైఫల్యానికి నిదర్శనం కాదా? అని దుయ్యబట్టారు.