ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాని మోదీతో ఆలోచనలు పంచుకున్నా: చంద్రబాబు - తెదేపా అధినేత చంద్రబాబు

కరోనా కట్టడిలో భాగంగా కలిసి పనిచేద్దామని ప్రధాని మోదీ తనను కోరినట్టు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ఆర్గనైజేషన్ పేరిట ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ద్వారా తాము రూపొందించిన నివేదికను మోదీ అభినందించినట్టు చెప్పారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తన ఆలోచనలు పంచుకున్నట్టు చంద్రబాబు తెలిపారు.

tdp chief Chandrababu
తెదేపా అధినేత చంద్రబాబు

By

Published : Apr 14, 2020, 3:22 PM IST

Updated : Apr 14, 2020, 3:57 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు

కరోనా విపత్తును కలసికట్టుగా ఎదుర్కొని ప్రజలను కాపాడుకుందామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కొత్త ఎన్నికల కమిషనర్ ను నియమించడం ఏంటంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానిది వింత ప్రవర్తన కాకపోతే మరేంటని ప్రశ్నించారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ఆర్గనైజేషన్ పేరిట ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ద్వారా కరోనా నివారణకు సాంకేతిక సాయం అందిస్తున్నామన్నారు. ప్రజలకు తగిన సమాచారం అందిస్తున్నట్టు చెప్పారు. మేధావులు, నిపుణులు, వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని తమ అధ్యయనాలపై ప్రధానికి నివేదిక పంపినట్లు వెల్లడించారు. జోన్ల వారీగా కరోనా వ్యాప్తి ప్రాంతాలను విభజించాలని ఆ లేఖలో కోరామని చెప్పారు. ఈ ఉదయం తనకు ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారని.. తమ అధ్యయనాలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.

రాజకీయ లబ్ధి విడనాడాలి...

కరోనా కట్టడికి గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు అమలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించినట్లు చంద్రబాబు తెలిపారు. కేంద్రం కూడా సానుకూలంగా ఉందని తెలిపారు. కరోనాపై సమష్టిగా పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. భేషజాలు, రాజకీయ లబ్ధి అసలే వద్దని హితవు పలికారు. ప్రభుత్వాలు - ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటేనే కరోనా నివారణ సాధ్యమని తేల్చిచెప్పారు.

నిత్యావసరాలు ఇంటికే డెలివరీ చేయాలి...

ప్రభుత్వం నిత్యావసరాలు ఇంటింటికి డోర్ డెలివరీ చేయాలని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం పకడ్బందీగా, కచ్చితంగా వ్యవహరిస్తేనే ఈ రోగం వ్యాపించకుండా నిరోధించగలమన్న చంద్రబాబు... ఎక్కువ కేసులు వచ్చిన ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పేదవాడికి తిండి సమస్య ఐతే, రైతులకు పండించిన పంటలు అమ్ముడుపోక సమస్య, కార్మికులకు ఉపాధి సమస్య ఉన్నందున అందరినీ ప్రభుత్వమే ముందుకొచ్చి ఆదుకోవాలని స్పష్టం చేశారు.

మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం...

మే 3 వరకు లాక్డౌన్ పాటించాలని మోదీ చెప్పటాన్ని స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అందరూ దీనిని పాటించాలని కోరారు. ప్రపంచం మెుత్తం కరోనా ఉందని ప్రజలు గ్రహించాలని కోరారు. కనిపించని ఆ శత్రువుపై ప్రతి ఒక్కరూ వీరోచితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

మార్చి 24 నుంచి ఏప్రిల్ 14వరకు వివిధ రాష్ట్రాల్లో తీసుకున్న జాగ్రత్తల వల్ల కరోనాని కట్టడి చేయగలిగారని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో అవసరాలకు తగ్గట్టుగా కరోనా పరీక్షలు జరగట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో 178 పరీక్షలు మాత్రమే రోజుకు జరుగుతున్నాయని... వివిధ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రయోగశాలలు ఉంటే మన రాష్ట్రంలో 7 మాత్రమే ఉండటం సరికాదని అన్నారు. ప్రధాని ఇచ్చిన 7 సూత్రాలు ప్రతి ఒక్కరూ పాటించాలని చంద్రబాబు కోరారు.

తామంతా ఇళ్లలోనే ఉండి అంబేడ్కర్ జయంతి చేసుకుంటుంటే.. వైకాపా నేతలు మాత్రం గుంపులుగా చేరి ప్రదర్శనలు చేయడం సరికాదన్నారు.

ఇవీ చదవండి:

అమ్మ ప్రేమ ఒక వైపు... కరోనా కట్టడి బాధ్యత మరోవైపు!

Last Updated : Apr 14, 2020, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details