ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్‌ కుటుంబం దోపిడీ పెరిగిపోయింది..రూ. 2 లక్షల కోట్లు దోచుకుందన్న తెదేపా - జగన కుటుంబంపై తెదేపా ఆరోపణలు

TDP ALLEGATIONS ON JAGAN FAMILY : వైఎస్సార్​ హయాంలో జరిగిన అవినీతికి ఆధునికతను జోడించి జగన్‌ కుటుంబం ఇప్పటివరకు రూ.2 లక్షల కోట్లకు పైగా దోచుకున్నట్లు చెబుతున్న తెలుగుదేశం.. ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. పార్టీ శ్రేణుల ద్వారా ప్రజలకు వివరించేలా కరపత్రాలు, పుస్తకాలు పంపిణీ చేస్తోంది. దిల్లీ మద్యం కుంభకోణంలో జగన్, భారతీరెడ్డి, విజయసాయిరెడ్డి పాత్ర ఉందని వివరిస్తూ.. ఓ పుస్తకాన్ని తెలుగుదేశం రూపొందించింది.

TDL ALLEGATIONS ON JAGAN FALSE
TDL ALLEGATIONS ON JAGAN FALSE

By

Published : Sep 4, 2022, 4:56 PM IST

జగన్‌ కుటుంబం దోపిడీ పెరిగిపోయిందన్న తెలుగుదేశం.. రూ. 2 లక్షల కోట్లు దోచుకున్నట్లు ఆరోపణ

TDP ALLEGATIONS ON JAGAN : తండ్రి వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి హయాంలో లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నది చాలక.. వైకాపా అధికారంలోకి వచ్చాక జగన్‌ మరో 2 లక్షల కోట్లకు పైగా దోచేశారని.. తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధిష్ఠానం పార్టీ శ్రేణులకు సూచించింది. పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలోనూ 'జగన్‌రెడ్డి కుటుంబ కుంభకోణాలు’ అన్న అంశంపై ప్రత్యేకంగా చర్చ చేపట్టారు. సమావేశానికి హాజరైన పార్టీ నాయకులకు అందజేసిన 47 పేజీల అజెండా బుక్‌లెట్‌లో.. 13 పేజీల్ని ఈ అంశానికే కేటాయించారు. జగన్‌ కుటుంబం, వారి సన్నిహితుల కుంభకోణాలు ఇవే అంటూ వాటిని విస్తృతంగా చర్చించింది.

సరస్వతీ సిమెంట్స్‌కి గనులు, నీళ్లని ఏకపక్షంగా కేటాయించుకున్నారని.. పరిశ్రమకు ఇచ్చిన భూముల్లో 25.4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ, లేదన్నట్టుగా కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చారని తెలుగుదేశం పేర్కొంది. దిల్లీ మద్యం కుంభకోణంలో జగన్‌తోపాటు ఆయన సతీమణి భారతీరెడ్డికి, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధాలున్నాయని ఆరోపించింది. సీబీఐ కేసులు, నిందితుల వివరాలే ఇందుకు సాక్ష్యాధారాలని తెలిపింది. సీబీఐ పెట్టిన కేసులో ఏ5గా ట్రైడెంట్‌ లైఫ్‌సైన్సెస్‌ కంపెనీని, ఏ8గా ఆ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న శరత్‌చంద్రారెడ్డిని పేర్కొన్నట్లు తెలిపింది.

ఈ శరత్‌చంద్రారెడ్డి స్వయానా విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి సోదరుడేనని పేర్కొంది. ట్రైడెంట్‌ లైఫ్‌సైన్సెస్‌ కంపెనీ..జగతి పబ్లికేషన్స్‌లో కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొందని గుర్తు చేస్తూ.. ట్రైడెంట్‌ లైఫ్‌సైన్సెస్‌ 'నీకిది-నాకది' విధానంలో జగతి పబ్లికేషన్స్‌కి కోట్లు మళ్లించిందని తెలుగుదేశం ఆరోపిస్తోంది. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న వాటిలో ట్రైడెంట్‌ కంపెనీ ఒకటని తెదేపా పేర్కొంది.

2008 వైఎస్‌ హయాంలో లేపాక్షి నాలెడ్జ్‌హబ్‌ పేరుతో అనంతపురం రైతుల్ని బెదిరించి, భయపెట్టి 8 వేల 844 ఎకరాలు సేకరించారని, ఆ భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 4 వేల 500 కోట్ల రుణం తీసుకున్నారని తెలుగుదేశం తెలిపింది. వీటిలో 750 కోట్లు కమీషన్ల రూపంలో జగతి పబ్లికేషన్స్, ట్రైడెంట్‌ లైఫ్‌సైన్సెస్‌లోకి మళ్లించారని తెలిపింది. ఇప్పుడు జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి కొడుకు డైరెక్టర్‌గా ఉన్న రూ.4 కోట్ల ఆదాయం కూడా లేని ఎర్తిన్‌ కంపెనీకి ఆ భూముల్ని రూ.500 కోట్లకే కట్టబెట్టేలా బ్యాంకులపై ఒత్తిడి తెస్తున్నారని తెదేపా ఆరోపించింది.

పాత విశాఖ-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులోని భమిడికలొద్దిలో 121 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక గిరిజనుడి పేరుతో లేటరైట్‌ మైనింగ్‌కి అనుమతులు తీసుకుని.. బాక్సైట్‌ తవ్వేసి రోజూ వందల లారీల సరుకు భారతీ సిమెంట్స్‌కి తరలిస్తున్నారని తెదేపా ఆరోపించింది. వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి, ఆయన భాగస్వామి లవకుమార్‌రెడ్డి, జగన్‌ సోదరుడు అనిల్‌రెడ్డి మైనింగ్‌లో భాగస్వాములని పేర్కొంది. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం పెడతానని.. 15 వేల కోట్ల విలువైన ఓబులాపురం గనుల్ని దోచుకున్న గాలి జనార్థన్‌రెడ్డికి మళ్లీ గనులు ఎలా ఇస్తారని నిలదీసిన తెలుగుదేశం.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది.

7 వేల కోట్ల రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలించారని, దానిలో వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కీలక పాత్రధారని తెదేపా ఆరోపించింది. జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి అండతో ఎర్రచందనం మాఫియా రెచ్చిపోతోందని.. వైకాపా నేతలు మూడేళ్లలో 10 లక్షల కోట్ల విలువైన 3 లక్షల టన్నుల ఎర్ర చందనం విదేశాలకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్‌ బినామీ శేఖర్‌రెడ్డికి చెందిన టర్న్‌కీ అనే సంస్థ పేరుతో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details