ప్రజాధనం కాపాడతానంటూ ఎన్నో నీతి వ్యాఖ్యలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM JAGAN), పద్దుల్లో చూపని(FINANCIAL IRREGULARITIES) వేల కోట్ల రూపాయలపై సమాధానం చెప్పాలని తెదేపా శాసనసభాపక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు.
"ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ అధ్యయనం ప్రకారం లెక్కలు లేని రూ.41వేల కోట్లపై విచారణ జరపాలని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ గవర్నర్కు ఫిర్యాదు చేయటం సిగ్గుచేటు. రెండేళ్లలోనే రూ.41వేల కోట్లు తరలించారంటే, వచ్చే మూడేళ్లలో ఇంకెంత ప్రజాధనాన్ని దోచుకుంటారో అనే భయం ప్రజల్లో ఉంది. ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వకపోగా, ఉప ప్రణాళిక నిధుల్నీ మళ్లిస్తున్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి కాపాడాలి" -డోలా బాలవీరాంజనేయ స్వామి, తెదేపా శాసనసభాపక్ష విప్
ట్రెజరీ అధికారుల సంతకాలు లేకుండానే బిల్లుల చెల్లింపులు..
ట్రెజరీ తనిఖీ(TREASURY) కోసం బృందం.. ఈ ఏడాది మార్చి 22 నుంచి 26 వరకు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, దాని పరిధిలోని వివిధ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించింది. 10,806 బిల్లులకు సంబంధించి రూ.41,043.08 కోట్లను ట్రెజరీ కోడ్ నిబంధనలను పాటించకుండా స్పెషల్ బిల్లుల కేటగిరీలో డ్రా చేసినట్టు గుర్తించింది. అవి దేనికి ఖర్చు చేశారన్న వర్గీకరణ, డీడీఓ, లబ్ధిదారుల వివరాలు, మంజూరు, ప్రొసీడింగ్స్ వివరాలు, సబ్‌వోచర్లు వంటివేమీ లేవు. వివిధ ఖజానా కార్యాలయాల పరిధిలో 8,614 స్పెషల్ బిల్లుల కింద రూ. 224.28 కోట్లు చెల్లించారు, మరో 2,164 బిల్లులకు సంబంధించి రూ. 40818.79 కోట్లు స్పెషల్ బిల్లుల కింద సర్దుబాటు చేశారు. ఆ బిల్లులన్నీ ట్రెజరీల ద్వారా రాలేదు. నిజానికి ట్రెజరీ అధికారుల సంతకంతోనే అవి జరగాలని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ పేర్కొన్నారు.