ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 25, 2020, 8:57 PM IST

ETV Bharat / city

ఆ రాష్ట్రాలే అధ్యక్షుడిని నిర్ణయిస్తాయి : తానా ప్రెసిడెంట్ జైశేఖర్ తాళ్లూరి

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రీ పోల్ సర్వేలలో డెమోక్రాట్ అభ్యర్థి బైడెన్ ముందంజలో ఉన్నా అసలు పోరులో ఏం జరుగుతుంతో చెప్పలేమని.. ప్రవాస భారతీయుడు, తానా ప్రెసిడెంట్ జైశేఖర్ తాళ్లూరి అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో రెండు పార్టీలకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితుల్లో మార్పులేదని.. పోరు హోరాహోరీగా జరిగే బాటిల్ స్టేట్సే అధ్యక్ష ఎన్నికను నిర్దేశిస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు. పోరు తీవ్రంగా జరిగే రాష్ట్రాల్లో కూడా మన వాళ్ల ఓట్లే కీలకం కానున్నాయని అంటున్నారు. అగ్రరాజ్యపు అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నవంబర్ 3వ తేదీ నాటికి పోలింగ్ ముగియనుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జైశేఖర్​తో 'ఈటీవీ భారత్' ప్రత్యేక ముఖాముఖి..

ఆ రాష్ట్రాలే అధ్యక్షుడిని నిర్ణయిస్తాయి: తానా ప్రెసిడెంట్ జైశేఖర్ తాళ్లూరి
ఆ రాష్ట్రాలే అధ్యక్షుడిని నిర్ణయిస్తాయి: తానా ప్రెసిడెంట్ జైశేఖర్ తాళ్లూరి

తానా ప్రెసిడెంట్ జైశేఖర్ తాళ్లూరితో ప్రత్యేక ముఖాముఖి..

ప్రశ్న: అమెరికా ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అక్కడి ఎన్నికలంటే.. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ఎలా నడుస్తోంది అక్కడ?

జవాబు: చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే ఇక్కడి పౌరులు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. నవంబర్ 3తో ఓటింగ్ ముగుస్తుంది. అమెరికా ఎన్నికలంటే.. భారత్​లోనే మీడియా హడావుడి ఎక్కువుగా ఉంటుంది. భారత్​లో ఉన్నంత ఆసక్తి అమెరికాలో ఉండదు. పోలింగ్ శాతం కూడా ఎప్పుడూ 55 శాతం దాటదు. అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారు అన్న విషయాన్ని తప్పితే.. మిగతా ఎన్నికల ప్రక్రియను అంతగా పట్టించుకోరు. స్థానికంగా ఉండేవారికి.. వారి కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు ఎవరో కూడా తెలీదు. భారత్​లో లాగా మొత్తం ఎన్నికల ప్రక్రియపై అంత ఆసక్తి ఉండదు. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో డెమోక్రాట్లకు మొగ్గు ఎక్కువుగా ఉంది.

ప్రశ్న: కిందటిసారి ఎన్నికలను చూస్తే.. ప్రీ పోలింగ్ సమయంలో డెమోక్రాట్లకు అనుకూలంగా కనిపించింది. భారత్ లాంటి చోట్ల హిల్లరీ క్లింటన్ గెలుస్తారనే అభిప్రాయమే వ్యక్తమైంది. కానీ ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. ట్రంప్ పాలన ఎలా ఉందో ఈ నాలుగేళ్లు జనం చూశారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని మీ అంచనా?

జవాబు: కిందటి ఎన్నికల్లో వివిధ దేశాల ప్రజల ఓట్లు హిల్లరీ క్లింటన్​కు వస్తాయి అనుకున్నారు. అలాగే సబర్బన్ మామ్స్ ( నగరాల బయట ఉండి ఉద్యోగాలు చేసుకునే మహిళలు ) ఓట్లు కూడా హిల్లరీకి వస్తాయి అని అంచనా వేశారు. కానీ ఏ కారణం వల్లనో అలా జరగలేదు. ట్రంప్​కు కలిసొచ్చిన అంశం ఆయన సంప్రదాయ రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఒక వ్యాపారవేత్త. అదే అతనికి కలిసొచ్చింది. ఎన్నికలకు ముందు పరిస్థితి మొత్తం ట్రంప్​కు వ్యతిరేకంగా ఉంది. మీడియా కూడా వ్యతిరేకించింది. కచ్చితంగా ఓడిపోతారు అనుకున్నారు. కనీసం 270ఎలక్టోరల్ ఓట్లు వస్తాయో రావో అనుకుంటే.. 300కు పైగా వచ్చాయి. ఇప్పుడు కూడా ఎన్నికలకు ముందు బైడెన్ ముందంజలో ఉన్నారు. కానీ చివరికి ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి పోరు ఆసక్తికరంగానే ఉంది.

ప్రశ్న: కిందటిసారి ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్​కు బాగా మెజార్టీ వచ్చింది. అదే ఆయనకు అధ్యక్ష పదవి తెచ్చింది. ఇప్పుడు ఏయే రాష్ట్రాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి?

జవాబు:మధ్య పశ్చిమ (మిడిల్ వెస్ట్) రాష్ట్రాలు.. వీటిని రెడ్ స్టేట్స్ అంటారు. ఇక్కడ ఎప్పుడూ రిపబ్లికన్లకు అనుకూలంగానే ఉంటుంది. కోస్తా రాష్ట్రాల్లో మాత్రం డెమోక్రాట్లకు అనుకూలంగా ఉంటుంది. న్యూయార్క్, కాలిఫోర్నియా వంటి కోస్తా ప్రాంతాల్లో ఎక్కువుగా వలసదారులు ఉంటారు. పైగా ఇవన్నీ చాలా పెద్ద రాష్ట్రాలు. కాలిఫోర్నియాలో 55, న్యూయార్క్​లో 30కిపైగా ఎలక్టోరియల్ ఓట్లు ఉన్నాయి. అలాగే ఇలనాయిస్ కూడా పెద్దరాష్ట్రం... అక్కడా డెమోక్రాట్లకు మెజార్టీ ఉంటుంది. రెడ్​స్టేట్లలో రిపబ్లికన్లకు, కోస్తా ప్రాంతంలో డెమెుక్రాట్లకు మెజార్టీ అన్నది స్పష్టం. ఈ రెండు ప్రాంతాలను రెండు పార్టీలు పంచుకుంటాయి. ఇక్కడ ఫలితాల్లో మార్పు ఉండదు. పోరు తీవ్రంగా ఉండే రాష్ట్రాలే ఫలితాలను నిర్ణయిస్తాయి. ఓహాయో, పెన్సిల్వేనియా, మిషీగన్ లాంటివి రిపబ్లికన్లకు అనుకూలంగా రావడంతో ట్రంప్ గెలవగలిగారు. ఇప్పటివరకూ ఓహాయోలో గెలవకుండా ఏ రిపబ్లికన్ అభ్యర్థి కూడా వైట్​హౌస్​కు వెళ్లలేదు. ఇవి కాకుండా కొలరాడో, నెవడా, నార్త్ కరోలినా కూడా ముఖ్యమైనవి. అందుకే ట్రంప్ తన పదవీకాలంలో దాదాపు పదిసార్లు ఈ ప్రాంతంలో పర్యటనలు చేశారు. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. 47ఏళ్లు రాజకీయ అనుభవం ఉన్న బైడెన్ పుట్టింది పెన్సిల్వేనియాలో. ఆయన డలోవేర్ కు సెనేటర్​గా ఉన్నా కూడా పెన్సిల్వేనియాలోనే నివసిస్తారు. రిపబ్లికన్ల తరఫున ఒహాయోకు రెండుసార్లు గవర్నర్​గా పనిచేసిన జాన్​కాసిక్ ఇప్పుడు డెమోక్రాట్లకు మద్దతిస్తున్నారు. ఇంతకుముందు రిపబ్లికన్ అధ్యక్ష పదవికి పోటీపడిన జాన్ మికెన్ భార్య కూడా ఇప్పుడు డెమోక్రాట్లకు మద్దతిస్తున్నారు. ఫలితాలను నిర్దేశించే.. ఈ రాష్ట్రాల్లో బైడెన్ 5-6శాతం ముందంజలో ఉన్నారు. ఇక్కడే మన భారతీయులు, ఇతర వలసదారులు కూడా ఎక్కువుగా ఉన్నారు. ఓట్లు ఎలా ఉంటాయో చూడాలి.

ప్రశ్న: ట్రంప్ నాలుగేళ్ల పాలన ఎలా ఉంది. ట్రంప్ గెలిస్తే.. ఏ అంశాల వల్ల గెలుస్తారు? ఓడిపోతే.. ఎందుకు ఓడిపోతారు అనుకుంటున్నారు?

జవాబు: ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ బాగుంది. కొవిడ్ పరిస్థితుల్లో కూడా అమెరికన్ ఆర్థిక వ్యవస్థ బాగా కోలుకుంది. నిరుద్యోగం అదుపులో ఉంది. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఇవన్నీ ఆయనకు సానుకూలాంశాలు. అంతర్గత భద్రత విషయంలో ట్రంప్ పాలన బాగుందనే అభిప్రాయం ఉంది. బ్లాక్ లైఫ్ మాటర్స్ వంటి ఆందోళనలు జరిగినప్పటికీ.. భద్రత విషయంలో ఆందోళనలు లేవు. విదేశాంగ విధానంలోనూ ట్రంప్​కు సానుకూలత ఉంది. చైనాను డీల్ చేసిన విధానం, పారిస్ ఒప్పందం నుంచి బయటకు రావడం, ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులిచ్చే విషయం, ఇరాన్ అణువిధానంపై వ్యవహరించిన విధానం వీటన్నింటిలో రాజకీయాలకు అతీతంగా.. అమెరికాకు ఏది మంచిది అనే విషయాన్నే ఆలోచించారు అనే అభిప్రాయం అమెరికన్లలో ఉంది. అలాగే ఈయన వ్యాపారులకు చాలా అనుకూలం. ఉద్యోగాల కల్పన విషయంలో ముందుంటారు అనే పేరుంది. క్రిమినల్ జస్టిస్ సంస్కరణలు వంటివి కూడా సానుకూలంగా ఉన్నాయి. ఒకప్పుడు నల్లవారి దగ్గర డ్రగ్స్ ఉంటే వెంటనే జైలులో పెట్టేవారు. అది మార్చారు. అలాగే నల్లవారి కోసం యునైటెడ్ నిగ్రో కాలేజ్ ఫండింగ్ అని చాలా పెద్ద కార్యక్రమం తీసుకొచ్చారు. వారికి ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పోయినసారి ఎన్నికల్లో కేవలం 8శాతం మంది మాత్రమే ట్రంప్​కు మద్దతివ్వగా.. ఈసారి 23 శాతం ఆయనకు అనుకూలంగా ఉంటారని అంచనా. చివరకు ఎవరికైనా కావలసింది ఉపాధే... ఆ విషయంలో నల్లవారి కోసం ట్రంప్ చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. కాబట్టి బ్లాక్స్ లైఫ్ మాటర్ వంటి ఆందోళనలు జరిగినా.. వారి మద్దతు కూడా ఆయనకు ఉంటుంది అనుకుంటున్నారు. ఇక ఓడిపోతే.. ఎందుకు ఓడతారు అంటే.. నా ఉద్దేశంలో మాస్క్ పెట్టుకోకపోవడం. అది ఆయన స్వయంకృతాపరాధం. మాస్కు పెట్టుకోలేదు. ఆయనకు కూడా కరోనా వచ్చింది. కొవిడ్ ను మొదట్లో చాలా తేలికగా తీసుకున్నారు అనే భావన ఉంది. మీడియా పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఈ నాలుగేళ్లలో మీడియా ఆయన్ను పూర్తిగా వ్యతిరేకించింది. అలాగే బ్లాక్స్ లైఫ్ మాటర్ అనేది కొంత వ్యతిరేకత తీసుకురావచ్చు. అనూహ్యంగా ఉండే ఆయన వ్యవహారశైలి, పద్ధతి, గౌరవం లేకుండా వ్యవహరించే విధానం కొంతమందికి నచ్చకపోవచ్చు. అధ్యక్షుడిగా ఆయన అంగీకార యోగ్యత కూడా పడిపోయింది. ఆయనకు 43శాతం మందే అనుకూలంగా ఉండగా.. 56శాతం మంది వ్యతిరేకించారు.

ప్రశ్న: అమెరికా ఎన్నికల ప్రక్రియలో ప్రెసిడెన్షియల్ డిబేట్ అన్నది చాలా ముఖ్యమైనది. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన రెండు డిబేట్లపై అమెరికన్ల అభిప్రాయం ఎలా ఉంది?

జవాబు: మొదటి చర్చను చూసి చాలా మంది సిగ్గుపడ్డారు. వీళ్లా అమెరికన్ ప్రెసిడెంట్లు అయ్యేది అని బాధపడ్డారు. ఇద్దరూ కూడా పరస్పరం గౌరవం లేకుండా మాట్లాడుకోవడంపై వ్యతిరేకత వచ్చింది. రెండో డిబేట్ బాగా జరిగింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి అని ఆదేశించడంతో రెండోసారి సరిగ్గా జరిగింది. ఇద్దరూ కూడా తమ విధానాలను బాగా వివరించగలిగారు.

ప్రశ్న: రెండో డిబేట్ లో ట్రంప్ ...' వ్యాపారవర్గాలకు అనుకూలమనే' తన ట్రంప్ కార్డును బాగా వాడినట్లు కనిపించింది. ఇంధన సంస్థలపై పర్యావరణ ఆంక్షలు తీసుకొస్తామని బైడెన్ చెప్పినప్పుడు.. ట్రంప్ స్థానికతను రెచ్చగొట్టినట్లుగా కనిపించింది. వ్యాపారవర్గాలకు బైడెన్ వ్యతిరేకం అనే భావన కలిగించారు కదా.. ?

జవాబు: ట్రంప్ మాట్లాడే విధానమే అలా ఉంటుంది. ఎదుటివారిపై దాడి చేస్తున్నట్లుగానే ఉంటుంది. పర్యావరణ విధానంపై బైడెన్ మాట్లాడుతున్నప్పుడు... దానిలోనుంచి అవకాశం తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే నా ఉద్దేశంలో ఇద్దరు అభ్యర్థులు కూడా రెండో డిబేట్​లో సమర్థంగా తమ వాదన వినిపించారు. వ్యాపారం, పన్నుల విషయంలో ట్రంప్ తన వాదన సమర్థంగా వినిపించారు. చారిత్రకంగా, సాంప్రదాయకంగా రిపబ్లికన్లు ఎప్పుడూ వ్యాపారవర్గాలకు అనుకూలంగా ఉంటారు. డెమోక్రాట్లు.. వలసదారులకు అనుకూలంగా ఉంటారు. చట్టబద్ధమైన వలసదారులను రిపబ్లికన్లు అనుమతిస్తారు. డెమోక్రాట్లు.. మాత్రం.. చట్టవ్యతిరేకంగా నివసిస్తున్న వలసదారులు, డ్రీమర్లకు ( చిన్నతనంలోనే యు.ఎస్ వచ్చిన వారు) కూడా అనుకూలంగానే ఉంటారు. ఓ రకంగా వారిని ఓటుబ్యాంకుగా మలుచుకుంటారు. అది వారి అనుకూలాంశం.

ప్రశ్న: అమెరికా ఎంత స్వేచ్ఛాయుత దేశమో.. అంతగా భయపడుతుంది అనే అభిప్రాయం ఉంది. స్థానికంగా ఉండే అమెరికన్లు తమ హక్కులు , అవకాశాలు కోల్పోతున్నామనే ఉద్దేశంతో ఉంటారు.. దానినే ట్రంప్ అవకాశంగా మలుచుకుంటున్నారనే భావన ఉంది?

జవాబు: మధ్య పశ్చిమ (మిడిల్ వెస్ట్) రాష్ట్రాల్లో ఉండే స్థానిక అమెరికన్లలో ఆ భావన ఉంటుంది. ట్రంప్ అధికారంలో ఉంటే తమకు భద్రత ఉంటుంది.. అనే భావనను ఆ రాష్ట్రాల ప్రజల్లో కల్పించారు. వారు ట్రంప్ గెలవాలనే అనుకుంటారు. అయితే ట్రంప్ ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే ఈ నినాదాన్ని తీసుకొస్తారు.. కానీ.. అధ్యక్షుడిగా తన నాలుగేళ్ల పాలనలో వలసదారులకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించలేదు.

ప్రశ్న: అమెరికాలో వలసదారుల జనాభా చాలా ఎక్కువ. డెమోక్రాట్లు పూర్తిగా వీరిపైనే ఎక్కువుగా ఆధారపడుతున్నారా? ఆ ఉద్దేశంతోనే కమలాహారిస్ ను ఉపాధ్యక్షురాలిగా ప్రకటించారు అనుకోవచ్చా?

జవాబు: కచ్చితంగా అలాగే అనుకోవచ్చు. కమలాహారిస్ అభ్యర్థిత్వాన్ని రెండు విధాలుగా వాళ్లు చూశారు. ఒకటి భారతీయులు ఓట్లు వేస్తారని... అలాగే నల్లజాతీయుల నుంచి కూడా మద్దతు వస్తాయన్నది వాళ్ల అంచనా. అలాగే మహిళల ఓట్లు కూడా పొందవచ్చు అనుకున్నారు. కానీ చరిత్ర చూస్తే.. సారా పాలిన్ ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసినప్పుడు కానీ, హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలిగా పోటీ చేసినప్పుడు కానీ.. మహిళల ఓట్లు పెద్దగా వారికి రాలేదు. అలాగే భారతీయుల ఓట్లను పొందడంలో కమలాహారిస్ పూర్తిగా సఫలం కాలేదు. ఆ విషయంలో ఆమె వెనకబడ్డారు అనే చెప్పాలి. అయితే ఉపాధ్యక్షులుగా ఎవరిని పెట్టినా ప్రజలు మాత్రం అధ్యక్ష అభ్యర్థిని చూసే ఓట్లు వేస్తారన్నది స్పష్టం. వీరి ప్రభావం కొంతవరకూ ఉండొచ్చు.

ప్రశ్న: ముఖ్యంగా ఎన్నారైలు పాత్ర ఏంటి? ఓ నేటివ్ ఇండియన్ కీలక స్థానంలో పోటీ చేస్తున్నారు. ఆ ప్రభావం ఎంతవరకూ ఉండబోతోంది?

జవాబు:కచ్చితంగా చాలా వరకూ ఉంటుంది. పోరు తీవ్రంగా ఉండే రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, వర్జీనియా, ఒహాయో ఇలాంటి చోట్ల భారతీయులు.. ముఖ్యంగా మన తెలుగువాళ్ల ఓట్లు ఇక్కడ ఎక్కువుగా ఉన్నాయి. వీరి ప్రభావం కచ్చితంగా ఉంటుంది.

ప్రశ్న: అమెరికన్ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ రెండేళ్ల క్రితం ప్రచురించిన రిపోర్టులో 2010-17 మధ్య తెలుగు మాట్లాడే వారి సంఖ్య 86శాతం పెరిగింది. అమెరికాలో అత్యధికంగా వృద్ధి చెందుతున్న విదేశీ భాష తెలుగు. ఈ ఎన్నికల్లో తెలుగు వాళ్ల పాత్ర ఏంటి?

జవాబు: దాదాపు 13లక్షల మంది తెలుగువాళ్లు అమెరికాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ మధ్య జారీ చేసిన గ్రీన్ కార్డుల్లో 5 లక్షల్లో... 3లక్షల 50వేలు తెలుగువాళ్లవే ఉన్నాయి. ఆ స్థాయికి వచ్చాం. ఎన్నికల బ్యాలెట్ లో కూడా తెలుగు భాష చేరింది. తెలుగు వారి ప్రాముఖ్యత అన్ని చోట్లా కనిపిస్తోంది. కొంత మంది ఉన్నత వ్యాపార వర్గాల వారు రాజకీయాల్లో కొంచెం కీలకంగానే ఉంటున్నారు. ఇన్నాళ్లు తెలుగువాళ్లు రాజకీయాల్లో పాలుపంచుకోలేదు. కానీ.. ఈ తరంలో వారు రాజకీయాల్లోకి వెళుతున్నారు. కొంతమంది ఫండ్ రైజర్లుగా ఉన్నారు. మన ఓటింగ్, డబ్బూ కీలకమే.. వారు కూడా తెలుగువాళ్లకు కొంచెం ప్రాముఖ్యతనే ఇస్తున్నారు.

ప్రశ్న: తెలుగువాళ్లు.. ఎవరికి అనుకూలంగా ఉన్నారు?

జవాబు: దీనిని రెండు విధాలుగా చూడొచ్చు. తొలిరోజుల్లో అమెరికా వచ్చిన వారు.. వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్లు ఎక్కువుగా పన్నులు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి రిపబ్లికన్లు వస్తే.. తమకు అనుకూలంగా ఉంటే బాగుంటుంది అని వాళ్లు అనుకుంటారు. కొత్తగా వచ్చేవాళ్లు మాత్రం.. ట్రంప్ హెచ్-1 వీసాలు కట్టడి చేశారు అన్న ఆలోచనతో డెమోక్రాట్లకు అనుకూలంగా ఉండొచ్చు. అయితే ట్రంప్ భారత్ తో మంచి సంబంధాలు నెరుపుతున్నారు. మన ప్రధాని మోదీతో మంచి సంబంధాలున్నాయి. ఈ కోణంలో చూసినప్పుడు.. రిపబ్లికన్లకు మద్దతు తెలపవచ్చు.

ప్రశ్న: వీసాలకు సంబంధించి భారతీయుల వైఖరి ఏంటి? ఎన్నికల తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయనుకుంటున్నారు?

జవాబు: ఫెయిర్​నెస్ ఫర్ హై స్కిల్ ఇమిగ్రెంట్స్ అనే బిల్లు ఉంది. నెంబర్ 386 అని పిలిచే ఈ బిల్లును ఆమోదిస్తామని ఇద్దరూ చెబుతున్నారు. దానిని ఆమోదిస్తే మాత్రం ఎవరు అధికారంలోకి వచ్చినా మనకు ఉపయోగంగా ఉంటుంది.

ప్రశ్న: భారత్-అమెరికా సంబంధాల విషయంలో చూస్తే.. ఎవరు గెలిస్తే మనకు అనుకూలం?

జవాబు: ఏ దేశానికి అయినా స్నేహపూర్వకంగా ఉండే దేశం భారత్. ఎవరు గెలిచినా భారత్ తో సంబంధాలు బాగానే ఉంటాయి. కాకపోతే ట్రంప్ మాత్రం భారత్ కు చాలా అనుకూలంగా ఉన్నారు. వ్యాపార విషయాల్లో చైనాను ఒంటరి చేయాలన్న ఆలోచనతో ట్రంప్ ఉన్నారు కాబట్టి.. ఆ కోణంలో భారత్​కు ఉపయోగపడుతుంది అన్నది నా భావన. హెచ్-1 వీసాలు వంటి విషయాన్ని పక్కన పెడితే రిపబ్లికన్లు గెలిస్తే.. మనకు కొంత లాభం ఉంటుంది. ఒకవేళ హెచ్-1 వీసాలు తగ్గినా అది పరోక్షంగా మన దేశానికే లాభిస్తుంది. ఎందుకంటే అమెరికాలో చేయాల్సిన ఆ పని అంతా కూడా అవుట్ సోర్సింగ్ రూపంలో భారత్ కే వస్తుంది. మిగతా దేశాలకు వెళ్లినా ఎక్కువశాతం లాభం భారత్ కే కలుగుతుంది. కాబట్టి వీసాలు గురించి ఆందోళన అవసరం లేదు.

ఇదీ చదవండి:'ట్రంప్​ మళ్లీ అధికారం కోరుకునేది అందుకే!'

ABOUT THE AUTHOR

...view details