ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Serial Killers: ఒంటరి వృద్ధులే లక్ష్యం.. జల్సాల కోసం ఆరుగురి హత్య!

ఒంటరిగా ఉన్న వృద్ధులే వారి లక్ష్యం. పగలు కూరగాయలు విక్రయిస్తూ రెక్కీ నిర్వహిస్తారు. కొన్ని ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటారు. రాత్రిళ్లు వచ్చి ఒంటరిగా ఉన్న వృద్ధులపై దుప్పటి వేసి ఊపిరాడనీయకుండా చేసి చంపేస్తారు . ఆ తర్వాత ఇంట్లో ఉన్న బంగారం, నగదు దోచుకుని దర్జాగా వెళ్లిపోతారు. ఇలా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూసి వరుసగా ఆరు హత్యలు చేసిన ఐదుగురు నరహంతకుల ముఠా పోలీసులకు చిక్కింది.

serial killers arrest at vijayawada
ఒంటరి వృద్ధులే లక్ష్యం

By

Published : Jun 24, 2021, 7:18 PM IST

Updated : Jun 25, 2021, 6:12 AM IST

ప్రయోజకులు కావాల్సిన వయసులో అయిదుగురు యువకులు కరుడుగట్టిన నేరస్థుల్లా మారారు. జల్సాల కోసం తొమ్మిది నెలల్లో ఆరుగురిని పాశవికంగా చంపారు. హత్యల ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. పైగా తాము చంపిన వారి అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. మరో 12 మందిని అంతమొందించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో పోలీసులకు చిక్కారు. వీరి అరాచకాలను గురువారం విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దర్యాప్తులో ప్రతిభ చూపిన సీఐ సత్యనారాయణ, ఎస్సై వెంకటేష్‌, హెడ్‌కానిస్టేబుల్‌ రెహ్మాన్‌, కానిస్టేబుల్‌ రమణలకు సీపీ రివార్డులు అందజేశారు. వివరాలు ఇవీ...

పట్టించిన వేలిముద్రలు

విజయవాడ శివారు పోరంకిలోని ఓ బ్యాంకు ఏటీఎంలో ఈనెల 12న చోరీ యత్నం జరిగింది. దర్యాప్తులో భాగంగా పెనమలూరు పోలీసులు సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించగా ముఖానికి ప్లాస్టిక్‌ కవర్లు వేసుకున్న వ్యక్తులు కనిపించారు. అనుమానంతో తాడిగడపకు చెందిన ఆటోడ్రైవర్‌ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీ యత్నానికి పాల్పడినట్లు అంగీకరించాడు. అతనిచ్చిన సమాచారంతో ముఠాలోని మిగిలిన వారినీ పట్టుకున్నారు. మొదట్లో వీరు తాము చేసిన హత్యలపై మౌనంగా ఉన్నారు. వీరి వేలిముద్రలను విశ్లేషించగా... కృష్ణా జిల్లా కంచికచర్లలో గత ఏడాది డిసెంబరులో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసులో నమోదైన నిందితుల వేలిముద్రలతో సరిపోలాయి. తొలుత బుకాయించినా... చివరికి హత్యల వివరాలు వెల్లడించారు.

వృద్ధులు, ఒంటరి వ్యక్తులే లక్ష్యం

పోరంకి, తాడిగడప, కామయ్యతోపు ప్రాంతాలకు చెందిన ప్రభుకుమార్‌, గోపీ రాజు, చక్రవర్తి అలియాస్‌ చక్రి, నాగదుర్గారావు అలియాస్‌ చంటి ఆటో డ్రైవర్లుగా పనిచేస్తుంటారు. ఫణీంద్ర కుమార్‌ పెయింటింగ్‌ చేస్తుంటాడు. వ్యసనాలకు బానిసలైన వీరు ముఠాగా ఏర్పడ్డారు. పగటి పూట ఆటోలు నడిపేవారు. కూరగాయలు అమ్మేవారు. పనిలోపనిగా కాలనీలకు దూరంగా ఉన్న, ఒంటరి వృద్ధుల ఇళ్లను గుర్తించేవారు. రెక్కీ నిర్వహించాక హత్యలకు పాల్పడేవారు.

  • మొదట... 2020 అక్టోబరులో పోరంకి విష్ణుపురం కాలనీలో ఒంటరిగా ఉంటున్న నళిని(58) అనే మహిళను హత్య చేశారు. తమ వివరాలు బహిర్గతం కాకపోవడంతో మరిన్ని ఘటనలకు తెగించారు. రెండోసారి... 2020, నవంబరులో పోరంకిలోని తూముల సెంటర్‌లో ఉండే సీతామహాలక్ష్మి(63)ని చంపారు. మూడోసారి... అదే ఏడాది డిసెంబరులో కంచికచర్లలోని నాగేశ్వరరావు(80), ప్రమీలారాణి(75) దంపతుల ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించి వారిని హతమార్చారు. బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఈ ఏడాది జనవరిలో తాడిగడపలో కట్టపై ఒంటరిగా ఉంటున్న ధనలక్ష్మి (58)ని, తర్వాత.. ఈనెలలో పోరంకిలోని పాత పోస్టాఫీసు సమీపంలో ఉంటున్న పాపమ్మ(85)ను చంపి, నగలతో ఉడాయించారు.
  • * నిందితులు తాము హత్య చేసిన ఇంటిపై నిఘా పెట్టేవారు. పోలీసులు వచ్చారా? బాధితులు, చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నారో తెలుసుకునే వారు. మృతదేహాలను శ్మశానానికి పంపే వరకు అక్కడే ఉంటారు. అవసరమైతే అంత్యక్రియల్లోనూ సాయం చేసేవారు.

12 మంది ప్రాణాలు దక్కాయి

ఇవిమాత్రమే కాకుండా కృష్ణా జిల్లాలోని కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు, గుంటూరు జిల్లాలోని తెనాలి, మంగళగిరిలో మరికొందరిని చంపాలని ఈ ముఠా సభ్యులు పన్నాగం పన్నారు. ఇప్పటికే రెక్కీ కూడా నిర్వహించారు. ఇంతలో పోలీసులకు దొరికిపోవడంతో 12 మంది ప్రాణాలు దక్కాయి.

హత్యలని తెలియకుండా..

వీరిపై గతంలో కేసులు లేకపోవడంతో కంచికచర్ల జంట హత్యల కేసులో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ ఏడాది మార్చిలో తాడిగడపలో మల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేశారు. బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లారు. దీనిపై పెనమలూరు స్టేషనులో కేసు నమోదైనా ఆధారాలు దొరకలేదు. మిగిలిన హత్యలపై పోలీసులకు ఫిర్యాదులు అందలేదు. హత్య జరిగినట్లు తెలియకుండా ఊపిరి ఆడకుండా చేసి, చంపేయడంతో అందరూ సహజ మరణాలుగా భావించి, అంత్యక్రియలు చేశారు. పోలీసులు మృతుల బంధువులకు స్వయంగా వెళ్లి చెప్పే వరకు హత్యలనే విషయం వారికి తెలియదు. హత్యలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల 40 తులాల నగలను దొంగిలించారు. వీటిని వేర్వేరుచోట్ల తనఖా పెట్టి, విక్రయించి, సొమ్ము తెచ్చుకుని జల్సాలు చేసేవారు.

ఇదీ చదవండి:

తాడేపల్లి అత్యాచారం ఘటనలో కొనసాగుతున్న నిందితుల వేట

Last Updated : Jun 25, 2021, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details