Satyam Babu: ఆయేషా మీరా హత్య కేసులో తనను నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించినందున.. తనకు పరిహారం ఇవ్వాలని ఆ కేసులో గతంలో అభియోగాలు ఎదుర్కొని నిర్దోషిగా బయటపడిన సత్యంబాబు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరారు. 2 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను సత్యంబాబు కోరారు. విజయవాడలోని కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్‌తో కలసి వచ్చిన సత్యంబాబు.. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
చేయని నేరానికి 9 జైలు శిక్ష అనుభవించానని.. కోర్టు నిర్దోషిగా విడుదల చేసినందుకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2017లో అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్‌ను కలిసి తనకు పరిహారం అందించాలని కోరానని.. ఇప్పటివరకు తనకు ప్రభుత్వం నుంచి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌ను కలసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపినట్లు చెప్పారు. పరిహారం ఇవ్వాలని ఎస్సీ కమిషన్ ప్రభుత్వానికి సూచించినా.. ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.