రాజధానిలో కృష్ణానది పక్కన కరకట్టను ఆనుకుని ఇసుక డంపింగ్ ఏర్పాట్లను నిలిపేయాలంటూ రైతులు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతుండగా పనులెలా చేస్తారంటూ రైతులు అడ్డుకొనేందుకు యత్నించగా.. పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. తాళ్లాయపాలెం సమీపంలో కృష్ణానదిలో తీసిన ఇసుకను కరకట్ట పక్కన డంపింగ్ చేసేందుకు గుత్తేదారు సంస్థ పనులు ప్రారంభించింది. విషయం తెలుసుకున్న రైతులు, మహిళలు శుక్రవారం ఉదయం అక్కడికి చేరుకుని పనులు అడ్డుకోబోగా పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో మహిళా రైతు కంభంపాటి శిరీష నినాదాలు చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మిగతావారినీ తరలించారు. దీన్ని నిరసిస్తూ రైతులు కరకట్టపై ఆందోళనకు దిగారు. ఇసుక తవ్వకాలు, డంపింగ్ నిలిపేసే వరకూ కదలబోమని రోడ్డుపై బైఠాయించి, నినాదాలు చేశారు.
15 మంది అరెస్టు
ఆందోళన విరమించాలని పోలీసులు చెప్పినా రైతులు పట్టించుకోలేదు. దీంతో 15 మందిని అదుపులోకి తీసుకుని వాహనాల్లోకి ఎక్కించి పెదకూరపాడు, అమరావతి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అంతకుముందు శిరీషను అరెస్టుచేసి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. రైతులు ఆందోళన చేయడంతో ఆమెను అమరావతి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.