నెల్లూరు కోర్టులో సాక్ష్యాధారాలు అపహరణకు గురికావటంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. ఈ చోరీ ఘటనపై ఎవరి ప్రమేయం లేకుండా కేసును నిశితంగా పర్యవేక్షించేందుకు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించాలని కోరారు. సమాజంలో శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు చోరీ కావటం న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కుట్రలో భాగస్వామ్యులైన వారందరినీ అరెస్టు చేయాలన్నారు.
ఇద్దరు నిందితులు అరెస్టు: కోర్టులో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విజయారావు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు సహా పూర్తి ఆధారాలతో కేసు ఛేదించినట్లు తెలిపారు. కంప్యూటర్లు, ఇనుప, పాత సామాన్లు దొంగతనం చేసే ముఠాలోని ఇద్దరు వ్యక్తులు చోరీ చేసినట్లు చెప్పారు. నిందితులు కేవలం సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకుని మిగతా పేపర్లను పడేశారని వెల్లడించారు. నిందితులు సయ్యద్ హయత్, ఖాజా రసూల్‌ను ఆత్మకూరు బస్టాండ్ వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులపై 14 పాత కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి ట్యాబ్, ల్యాప్‌ట్యాప్, 4 సెల్‌ఫోన్లు, 7 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.