రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గితే ప్రభుత్వ ఆదాయం ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాకే శైలాజనాథ్ డిమాండ్ చేశారు. పనికిమాలిన పేర్లతో చీప్ లిక్కర్ విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓ వైపు మద్యం దుకాణాలు తగ్గిస్తున్నామంటూ లెక్కల్లో చూపించి మరోవైపు వేరే రూపంలో దుకాణాల ఏర్పాటుకు తెర లేపారని దుయ్యబట్టారు.
ఏపీఎస్బీసీఎల్ ఇప్పటికే కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా వాకిన్ స్టోర్స్ నిర్వహిస్తోందని, సాధారణ మద్యం దుకాణాల్లో రోజుకు సగటున రూ.2-2.50 లక్షల మద్యం అమ్ముడైతే, వాకిన్ స్టోర్లో రూ.7-8 లక్షల మద్యం విక్రయిస్తున్నారన్నారు. నిజంగా సంపూర్ణ మద్య నిషేధం చేయాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే..వీలైనన్ని మార్గాల్లో చర్యలు తీసుకోవాలని శైలజానాథ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.