ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల కోసం జరుగుతున్న కసరత్తులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో బాగంగా వివిధ క్యాటగిరిలకు సంబంధించి 14 రకాల ఐచ్ఛికాలను అందుబాటులోకి తెస్తోంది. ప్రధానంగా బిల్డర్లు తమ వద్ద ఉన్న ప్లాట్లు అన్నింటిని ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రత్యేకంగా ఒక ఐచ్ఛికాన్ని అందుబాటులోకి తెస్తోంది.
మరో ఆప్షన్...
అదే విధంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రాలేని వృద్ధులతో పాటు ఇతర వర్గాల కోసం ప్రత్యేకంగా మరో ఆప్షన్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇక్కడ ఆస్తులు ఉండి ఇతర దేశాల్లో ఉన్న నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రత్యేకంగా ఐచ్ఛికం తెచ్చింది. ఇలా ఒక్కో క్యాటగిరికి ఒక్కో రకం ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఆన్లైన్ ద్వారా...
విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు తమ ఆస్తులకు సంబంధించి అన్‌లైన్ ద్వారా నిర్దేశించిన ఫామ్‌ని నింపాల్సి ఉంటుంది. అందులో వారి పూర్తి వివరాలు, పాస్‌పోర్టు వివరాలు, ఎంతకాలం నుంచి ఏ దేశంలో ఉంటున్నారు? తదితర వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.