ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rahul Murder Case: కీలక దశకు రాహుల్‌ హత్య కేసు..పది మంది పాత్రపై ఆరా !

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త రాహుల్‌ హత్య కేసులో సుమారు పది మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. ఎఫ్‌ఐఆర్‌లో నలుగురి పేర్లను చేర్చారు. ప్రస్తుతం ఈ జాబితా పదికి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

rahul murder mistery
rahul murder mistery

By

Published : Aug 26, 2021, 10:40 AM IST

పారిశ్రామికవేత్త రాహుల్‌ హత్య కేసులో ఇప్పటివరకు సాగిన దర్యాప్తు ఆధారంగా సుమారు పది మంది పాత్ర ఉన్నట్లు నిర్ధరణకు వచ్చారు. ఎఫ్‌ఐఆర్‌లో నలుగురి పేర్లను చేర్చారు. ప్రస్తుతం ఈ జాబితా పదికి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరిలో కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా పాలు పంచుకున్నట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల విచారణ దాదాపు పూర్తి అయింది. వీరు చెప్పిన వాటిని వివిధ మార్గాల్లో సరిపోల్చుకుంటున్నారు.

ఆధారాల వేట..

నగరంలో నిందితులు ప్రయాణించిన మార్గాల్లోని 74 సీసీ కెమెరాల్లోని దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చెప్పిన సమాచారం ఆధారంగా, ఆ సమయాల్లో నమోదైన ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేసు చివరి దశకు చేరడంతో సేకరించిన ఆధారాలు, వాటి రికార్డు పనిలో నిమగ్నమయ్యారు. కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్టు అయిన సత్యం, రిమాండ్‌లో ఉన్నారు. ఇతని నుంచి కీలకమైన వివరాలు రాబట్టేందుకు పోలీసులు తమ కస్టడీకి తీసుకునేందుకు పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. హత్య జరిగిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి వరకు నిందితుడు విజయకుమార్‌, ఘటనాస్థలికి సమీపంలోని ఓ ఇంట్లోనే ఉన్నట్లు విచారణలో బయటకు వచ్చిందని సమాచారం. మాచవరం స్టేషన్‌ సీఐ ప్రభాకర్‌ సెలవులో ఉండడంతో పెనమలూరు ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. దర్యాప్తు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెగ్యులర్‌ సీఐ ప్రభాకర్‌ తిరిగి విధుల్లో చేరడంతో ఆయనే దర్యాప్తు అధికారిగా ప్రస్తుతం బాధ్యతలు తీసుకున్నారు.

సత్యం తీరుపై అనుమానాలు

నిందితుడు కోగంటి సత్యంకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలో నెగిటివ్‌ వచ్చింది. ఇప్పటికే మచిలీపట్నం ఉపకారాగారంలో ఉన్న సత్యంకు అక్కడి జైలు అధికారులు 151 నెంబరును కేటాయించారు. సత్యంను ఇవాళ కానీ శుక్రవారం కానీ విజయవాడలోని జిల్లా జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు విచారణకు సహకరిస్తానని చెప్పిన సత్యం, హఠాత్తుగా సోమవారం ఉదయం బెంగళూరు విమానంలో పరారు కావడం వెనుక పెద్ద ప్రణాళిక ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కలకలం రేపిన హత్య..

విజయవాడ మొగల్రాజ్ పురం పరిధిలో ఈనెల 19న రాహుల్ అనే వ్యక్తి తన కారులో హత్యకు గురయ్యారు. వ్యాపార వాటాల్లో వివాదమే హత్యకు కారణమని, వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. మృతుడి తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు.

కెనడాలో చదివిన కరణం రాహుల్‌.. స్వదేశానికి వచ్చాక.. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన చేశారు. పోరంకిలో వారు నివాసం ఉంటున్నారు. అత్యవసరంగా మాట్లాడాలని ఫోన్‌ రాగా బుధవారం రాత్రి 7.30 సమయంలో రాహుల్‌ కారులో బయటకు వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోవారు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వచ్చింది. తెల్లవారిన తర్వాతా ఇంటికి రాకపోయేసరికి, రాహుల్‌ తండ్రి రాఘవ.. పెనమలూరు పోలీసులకు చెప్పారు. ఇంతలో వైర్‌లెస్‌ సెట్లో మొగల్రాజపురంలో కారులో మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. మృతుడు రాహుల్‌ అని అతడి తండ్రి గుర్తించి, భోరున విలపించారు.

ఇదీ చదవండి

RAHUL MURDER CASE:నా కుమారుడి హత్యలో వారికి భాగం: రాహుల్ తండ్రి రాఘవరావు

ABOUT THE AUTHOR

...view details