ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రఘురామ కేసు: అరెస్టులు.. కోర్టులు.. నాటకీయ పరిణామాలు! - raghurama arrest drama over all news

ఉత్కంఠ పరిణామాల నడుమ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజును గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య రోడ్డుమార్గం ద్వారా సాయంత్రం గుంటూరు జిల్లా జైలు నుంచి ఆయనను తరలించే ప్రక్రియ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని మెయిల్ ద్వారా అందుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..రఘురామను ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.

raghurama  arrest drama over all
రఘురామ కేసు

By

Published : May 18, 2021, 7:02 AM IST

Updated : May 18, 2021, 12:18 PM IST

ఎంపీ రఘురామరాజును ఈ నెల 14న సాయంత్రం హైదరాబాద్​లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు... అదే రోజు రాత్రి విజయవాడ మీదుగా గుంటూరుకు తీసుకువచ్చారు. సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి ఆయనను తీసుకొచ్చి విచారణ చేపట్టారు. రఘురామకృష్ణరాజుపై 124A, 153A, 505 రెడ్ విత్, 120(B) సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. రఘురామతోపాటు 2 న్యూస్ ఛానెళ్ల పేర్లను ఎఫ్ఐఆర్​లో నమోదు చేశారు.

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా కుట్ర పన్నారని దేశద్రోహం నేరం కింద.. సామాజికవర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ సీఐడీ అభియోగాలు మోపింది. వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. 15న సాయంత్రం సీఐడీ కోర్టులో హాజరుపర్చగా.. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ మెజిస్ట్రేట్ ఎదుట రఘురామ తన గాయాలను చూపించారు. కాళ్లు కట్టేసి.. ఐదుగురు వ్యక్తులు రబ్బరు కర్రలతో కొట్టినట్లు రఘురామకృష్ణ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

గాయాలపై నివేదిక కోరిన న్యాయస్థానం

ప్రభుత్వమే తనపై కక్షకట్టి కేసులు నమోదుచేసి పోలీసుల ద్వారా దాడి చేయించిందని...ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య చికిత్సలు నిర్వహించాలని ఆయన న్యాయమూర్తిని అభ్యర్థించారు. గాయాలున్నందున గుంటూరు జీజీహెచ్​తో పాటు రమేశ్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు మెజిస్ట్రేట్ కోరారు. వై-కేటగిరీ భద్రత మధ్యే వైద్యపరీక్షలు జరపాలన్న సీఐడీ కోర్టు.. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. శుక్రవారం రఘురామను అరెస్టు చేయగా..అదే రోజు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. శనివారం రెండు ధపాలుగా హైకోర్టులో, గుంటూరు సీఐడీ కోర్టుల్లో ఏకకాలంలో విచారణ జరిగింది. ఆదివారం కూడా హైకోర్టులో మరోసారి విచారణ జరగ్గా... సుప్రీం కోర్టులో బెయిల్ కోసం రఘురామ న్యాయవాదులు దరఖాస్తు చేశారు.

కోర్టు ఆదేశాలు బేఖాతరు

నాలుగో రోజు గుంటూరు సీఐడీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో మూడుచోట్ల విచారణలు జరిగాయి. కాగా..గుంటూరు సీఐడీ కోర్టు జారీచేసిన ఉత్తర్వులే ఈకేసులో కీలకంగా మారాయి. సీఐడీ కోర్టు న్యాయమూర్తి రఘురామరాజును ప్రభుత్వ ఆస్పత్రితోపాటు రమేశ్ ఆస్పత్రిలోనూ వైద్యపరీక్షలు నిర్వహించి నివేదికను అందజేయాలని ఆదేశించగా...రెండ్రోజులపాటు జీజీహెచ్​లోనే వైద్యపరీక్షలు నిర్వహించారు. రమేశ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయకుండానే జిల్లా జైలుకు తరలించారు.

దీనిని తప్పుబట్టిన హైకోర్టు.. తక్షణం రమేశ్ ఆస్పత్రికి రఘురామను తరలించాలని ఈనెల 16న (ఆదివారం) ఆదేశించింది. ఆదివారం రాత్రి ఆయనను ఆస్పత్రికి తరలిస్తారని రఘురామ న్యాయవాదులు భావించగా...సోమవారం మధ్యాహ్నం వరకు సీఐడీ అధికారులు ఆయనను రమేశ్ ఆస్పత్రికి తరలించలేదు. రఘురామను రమేశ్ ఆస్పత్రికి తరలించలేదని ఆతని తరపు న్యాయవాదులు.. తరలించనవసరం లేదని ప్రభుత్వ న్యాయవాదులు సీఐడీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు

హైకోర్టులో ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేయగా... రఘురామరాజు సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. రఘురామను ఆర్మీ జైలుకు తరలించాలన్న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆయనను గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ జైలుకు తరలించారు. ఓ అధికార పార్టీ ఎంపీపై అదే పార్టీకి చెందిన ప్రభుత్వం దేశద్రోహ నేరం కింద కేసు నమోదు చేయడం.. అతడిపై పార్టీపరంగా ఎలాంటి చర్యలు చేపట్టకుండానే కేసు నమోదుచేయడం...ఓ కేసుకు సంబంధించి సీఐడీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఏకకాలంలో విచారణ సాగడం విశేషంగా చెప్పుకోవాలి. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్​లో అరెస్టైన దగ్గర నుంచి సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలింపు దాకా వివిధ కోర్టుల్లో ఈ కేసులో విచారణ జరిగింది.

రఘురామ కృష్ణరాజు బెయిల్ పిటిషన్​పై విచారణను ఈ నెల 21 నాటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు..గురువారం లోపు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లా జైలు నుంచి ఎంపీ రఘురామ తరలింపు

Last Updated : May 18, 2021, 12:18 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details