CONDOLENCES ON BUS ACCIDENT: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటన పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డి గూడెం వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుందని - ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ దుర్గారావుతో సహా తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారని... మరికొందరి పరిస్ధితి విషమంగా ఉందని ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్‌కు తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన గవర్నర్ హరిచందన్ సహాయ చర్యలు వేగవంతం చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశం..
బస్సు ప్రమాదానికి గురై డ్రైవర్‌తో సహా ప్రయాణికులు మృతి చెందటం అత్యంత బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఘటన జరిగిన ప్రాంత సమీపంలో ఉన్న పార్టీ శ్రేణులు సహాయకార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. ప్రభుత్వం వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించటంతోపాటు బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనలో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానూభూతి తెలిపారు.
కేంద్ర మంత్రి ఆరా..
బస్సు ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటనపై ఆయన ఏపీ సీఎస్‌తో మాట్లాడి ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు.