నేరస్తులు, మోసగాళ్ల చేతుల్లో బాధితులుగా మారిన అమాయకపు ప్రజలకు న్యాయం చేసేందుకు.. అందరికీ అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు విజయవాడ పోలీసులు. నేరుగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు ఇబ్బందిపడే వారికి సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటూ.. ఎప్పటికప్పుడూ వచ్చిన ఫిర్యాదుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆ మేరకు ఫిర్యాదు చేసిన వారికి సమాచారం అందిస్తూ....కేసు తీవ్రతను బట్టి వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.
గతేడాది వచ్చిన ఫిర్యాదులు
గతేడాది జూన్ 17న ఓ వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా బాల్య వివాహం గురించి ఫిర్యాదు చేయగా.. వెంటనే స్పందించిన పోలీసులు ఆ పెళ్లి జరగకుండా అడ్డుకున్నారు. 2021 సెప్టెంబరు 1న కేరళకు చెందిన ఓ వైద్యురాలు.. విజయవాడలో ఓ వ్యక్తి సెకెండ్ హ్యాండ్ కారు విక్రయిస్తానని రూ.11 లక్షలు తీసుకుని మోసం చేశాడని ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. సంబంధిత వివరాల ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు...ఆమెకు డబ్బు ఇప్పించారు. ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ యువకుడు...హాస్టల్‌కు వెళ్లే సమయంలో ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదు చేయగా...నిఘా పెట్టిన పోలీసులు యువకుడిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు.