సాధు, సంతువులు.. పరోపకారం, ప్రజల సేవ కోసమే జన్మిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటక మైసూరు అవధూత దత్తపీఠాధిపతి.. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 80వ జన్మదినోత్సవాలను ఉద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఆధ్యాత్మిక, సమాజ సేవలో వారి ఆశ్రమాలు చేస్తున్న సేవలపై.. ప్రధాని ప్రశంసలు కురిపించారు. దత్తపీఠం.. వేద అధ్యయనానికి అతిపెద్ద కేంద్రంగా మారిందని అన్నారు. సంగీతం ద్వారా ఆరోగ్య పరిరక్షణ సహా.. ఆధ్యాత్మికతకు ఆధునికతను జోడించి దత్తపీఠం అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తోందన్నారు. ఇలాంటి సేవలే ప్రగతి శీల భారతానికి ఆత్మ వంటివని చెప్పారు. అటు భారత్‌లో అనుసరిస్తున్న విలువల కారణంగానే దేశానికి గుర్తింపు వచ్చిందని కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు.
సాధువులు పరోపకారం, ప్రజల సేవ కోసమే జన్మిస్తారు. ఓ సాధువు పుట్టుక, జీవితం కేవలం.. వ్యక్తిగత జీవిత యాత్రగా మాత్రమే ఉండదు. సమాజ ఎదుగుదల, సంక్షేమంతో కూడా వారి జీవిత యాత్ర అనుసంధానమై ఉంటుంది. శ్రీ గణపతి సచ్చిదానందస్వామీజీ జీవితం అందుకు ఓ ఉదాహరణ. దేశ, విదేశాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వారిఆశ్రమాల దిశ, ఆలోచన ప్రజలకు సేవ చేయడమే. 75వ స్వాతంత్య్ర దినోత్సవ కాలంలో.. మన ముందు రాబోయే 25 ఏళ్ల లక్ష్యాలు ఉన్నాయి. దత్తపీఠం సంకల్పం స్వాతంత్య్ర దినోత్సవ అమృతోత్సవ సంకల్పాలతో అనుసంధానం కాగలదని నేను విశ్వసిస్తున్నాను. -నరేంద్ర మోదీ, ప్రధాని