అక్షరాన్నీ.. అలజడినీ సమంగా ప్రేమించిన తమిళ మహాకవి సుబ్రమణ్య భారతీయార్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అక్షరాలను శక్తివంతంగా సంధించి సామాజికంగా నెలకొన్న అలజడిని రూపుమాపి ప్రజా చైతన్యాన్ని తెచ్చిన గొప్ప జాతీయవాదిగా అభివర్ణించారు. ఆంగ్లేయులను వెళ్లగొట్టాలంటే ముందుగా మనకు మనంగా కట్టుకొన్న కులం, మతం, ప్రాంతం, లింగ వివక్ష లాంటి అడ్డుగోడలను ఛేదించాలనే సత్సంకల్పంతో సుబ్రమణ్య భారతీయార్ రచనలు చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాజానికి ఆ మహాకవి అందించిన రచనలు నేటికీ మన ధర్మాన్ని గుర్తు చేస్తాయన్నారు. జాతీయ సమగ్రతను స్వప్నించిన ఆ మహాకవి శత వర్థంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ సుబ్రమణ్య భారతీయార్ను స్మరించుకోవాలని సూచించారు. జనసేన పక్షాన తాము ఆ మహాకవికి హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నామన్నారు.
తాను చెన్నైలో ఉన్న రోజుల్లో తన తమిళ మిత్రులు అనేక సందర్భాల్లో సుబ్రమణ్య భారతీయార్ కవితలు గానం చేసేవారని.. ఆ కవితలు చైతన్యపరస్తూ మానవ సంబంధాల గొప్పదనాన్ని చెప్పేవని పవన్ అన్నారు. ఇందులో 'చిన్నంజిరు కిళియే కన్నమ్మా.. సెల్వ కలంజియమే' తనకు అమితంగా ఇష్టమైనదన్నారు. ఆ కవితలో ఆడ పిల్లల గురించి మహాకవి చెప్పిన మాటలు మనసును హత్తుకున్నాయన్నారు. కన్నమ్మా..అనే మకుటంతో అమ్మకీ, నేలకీ మకుటం పెట్టిన మహాకవి సుబ్రమణ్య భారతీయార్ అని..మన నాలుకపై ఆయన కవిత ఉన్నంత కాలం ఆయన చిరంజీవే అని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.