ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఊరెళ్లిన ఓటర్లు...రప్పించేందుకు పార్టీల తిప్పలు

ఏ ఎన్నికలు చూసినా రాజధాని నగరంలో ఓటింగ్‌ 50 శాతానికి మించడంలేదు. ఈసారి కొవిడ్‌తో అది మరింత తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన ప్రధాన పార్టీలను కలవరపరుస్తోంది. సాఫ్ట్‌వేర్‌ సంస్థలన్నీ ఇళ్ల నుంచే ఉద్యోగులతో పని(వర్క్‌ ఫ్రం హోం) చేయిస్తుండటంతో అనేకమంది నగరాన్ని వీడి సొంత గ్రామాలు, పట్టణాలకు వెళ్లిపోయారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినవారు కూడా కొవిడ్‌ కారణంగా ఉపాధి అవకాశాలు లేక వెళ్లిపోయారు. వీరిలో చాలా తక్కువమంది మాత్రమే తిరిగి వచ్చారు. బల్దియా ఎన్నికల పోలింగ్‌పై ఆ ప్రభావం పడనుంది. పోలింగ్‌కు ముందే వారిని రప్పించడానికి పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇవి ఎంతవరకు ఫలిస్తాయన్న దానిపైనే ఓటింగ్‌ శాతం ఆధారపడి ఉందని చెబుతున్నారు.

parties are trying to get back hyderabad voters from their native
ఊరెళ్లిన ఓటర్లు...రప్పించేందుకు పార్టీల తిప్పలు

By

Published : Nov 24, 2020, 12:05 PM IST

భాగ్యనగరం ఓ మినీ భారత్‌. భిన్నమతాలు, కులాలు, ఆచారాలు కనిపిస్తాయి. ఒకరి సంప్రదాయాలను ఒకరు గౌరవిస్తూ మహానగరం వర్ధిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ ఇలా అనేక రాష్ట్రాలకు చెందిన లక్షలమంది ఉద్యోగులుగా, వివిధ రకాల వృత్తిపనివారిగా, కార్మికులుగా ఇక్కడ పనిచేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. గత కొన్ని ఎన్నికలపరంగా చూస్తే ఇక్కడ ఓటింగ్‌ తక్కువ నమోదవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 53 శాతం ఓటింగ్‌ నమోదైంది. మురికివాడల్లో 70 శాతం మంది పోలింగ్‌ కేంద్రాలకు వస్తుండగా, సంపన్న ప్రాంతాల్లో 40 శాతం మించి రావడం లేదు. విద్యావంతులూ నిర్లిప్తంగా ఉంటున్నారు.

నేతలకు బాధ్యతలు అప్పగించి..

కొవిడ్‌తో నగరం నుంచి వెళ్లిపోయిన అనేకమందిని పోలింగ్‌ రోజు రప్పించడానికి తెరాస ప్రయత్నాలు చేస్తోంది. కొంతమంది నేతలకు ఈ బాధ్యతలను అప్పగించింది. మంత్రి కేటీఆర్‌ కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు. ‘నగరంలో ఓటింగ్‌ 45 శాతం దాటడం లేదు...ఈసారి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి’ అని సోమవారం జరిగిన తెలంగాణ బిల్డర్ల సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీపై అభిమానంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెంది ఇక్కడ స్థిరపడిన ఓటర్లు తమకే ఓటు వేస్తారన్న నమ్మకంతో భాజపా నేతలు ఉన్నారు. ఈ ఓటర్లను రప్పించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

సాఫ్ట్‌‘వేర్‌’?: మహానగర పరిధిలోని అనేక ప్రాంతాల్లో దాదాపు 80వేల మంది వరకు కొవిడ్‌ బారినపడ్డారు. వెయ్యిమందికి పైగా చనిపోయారు. ఇప్పటికీ కొవిడ్‌ వైరస్‌ తీవ్రత పూర్తిగా తగ్గలేదు. ఈ ప్రభావం వివిధ రంగాలపై పడింది. సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో పనిచేసే దాదాపు 5 లక్షల మందిలో 80 శాతం ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. మూడొంతులు మందికిపైగా ఉద్యోగులు తమ స్వస్థలాల్లో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరంతా డిసెంబరు 1న జరిగే పోలింగ్‌కు వస్తారా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పరిశ్రమల కార్మికులు

కరోనా వల్ల రాజధాని చుట్టపక్కల వేలాది చిన్నపరిశ్రమలు మూతపడ్డాయి. ఇవి పూర్తిగా పని చేసిన తర్వాత వద్దామన్న ఉద్దేశంతో కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. వీరిలో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారే అధికం. ఇతరత్రా వృత్తుల్లో పని చేసేవారికి ప్రస్తుతం చేతినిండా పని లేదు.

అన్ని రంగాలు కలిపి

మొత్తంమీద అన్ని రంగాలు కలిపి ఉద్యోగులు, కార్మికులు దాదాపు 15 లక్షలమంది ప్రస్తుతం హైదరాబాద్‌లో లేరని నిపుణులు చెబుతున్నారు. వీరిలో అధికశాతం ఓటు హక్కు ఉన్నవారే. దీనికి తోడు వృద్ధులు ఎంతమంది ఓటింగ్‌కు ముందుకు వస్తారో తెలియని పరిస్థితి. వీటన్నింటిని బట్టి చూస్తే ఈసారి ఓటింగ్‌ శాతం 45కు మించే అవకాశం లేదని తెలుస్తోంది.

ఎన్నికలు.... ఓటింగ్‌ శాతం

2002 ఎంసీహెచ్‌ ఎన్నికలు 41.22

2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 42.95

2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 45.27

2014 అసెంబ్లీ ఎన్నికలు 50.86 శాతం

2018 అసెంబ్లీ ఎన్నికలు 53 శాతం

ఇదీ చదవండి:

రాష్ట్రానికి బయల్దేరిన రాష్ట్రపతి.. కాసేపట్లో తిరుపతికి చేరిక

ABOUT THE AUTHOR

...view details