ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

parents fight: పట్టించుకోని పిల్లలపై అమ్మానాన్నల న్యాయపోరాటం - పిల్లలపై కోర్టుకు ఎక్కుతున్న తల్లిదండ్రులు

parents fight : పిల్లల్ని కని, పెంచి పెద్దవాళ్లను చేసేందుకు అమ్మానాన్నలు లెక్కకుమిక్కిలిగా త్యాగాలు చేస్తుంటారు. జీవితంలో ఓ స్థాయికి చేరేందుకు వారధులుగా నిలుస్తారు. అలాంటి వాళ్లను వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోకపోతే... వాళ్ల పరిస్థితి ఏంటి..?.. మాకు దిక్కెవరు అంటూ దిగులు పడతూ కాలం వెళ్లదీయాలా..?.. అలా కాకుండా పిల్లలతో గొడవ పెడితే పరువు పోతుందేమో అని సంశయిస్తూ బాధలు పడాలా..?. కానే కాదంటున్నారు ఇప్పటి అమ్మానాన్నలు. తమను పట్టించుకోని పిల్లలపై న్యాయపోరాటం చేస్తున్నారు. ట్రైబ్యునళ్లలో పెరుగుతున్న కేసుల సంఖ్య ఈ విషయాన్ని చాటుతోంది.

parents fight
parents fight

By

Published : Mar 20, 2022, 4:32 AM IST

Updated : Mar 20, 2022, 6:25 AM IST

parents fight : బిడ్డలు భూమ్మీద పడ్డప్పటి నుంచి... పెరిగి పెద్దవాళ్లయ్యేదాకా... అమ్మానాన్నలకు ఎన్ని గాయాలో... వారివి ఎన్ని త్యాగాలో. పుట్టుకకు కారణమై... జీవితంలో ఓ స్థాయికి చేరేందుకు వారధులై నిలిచిన తమను వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోకపోతే... కంటనీరు నింపుకొని ఏడ్చే రోజులు పోయాయ్‌. పరువు పోతుందేమో... ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనే సంశయాల్ని వీడి... పిల్లలపై పెద్దలు ట్రైబ్యునల్‌కు ఎక్కుతున్నారు. న్యాయం కోసం వృద్ధులు పోరాడుతున్న ఘటనలు రాష్ట్రంలో పెరుగుతున్నాయ్‌... పలు ట్రైబ్యునళ్లలో కేసులు పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం...

పట్టించుకోని పిల్లలపై అమ్మానాన్నల న్యాయపోరాటం

* తల్లిని కుమారుడు జీవితాంతం ఇంట్లోనే ఉంచుకుని చూస్తేనే ఇల్లు, షాపులు ఆధీనంలోకి వస్తాయి. అప్పటిదాకా ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ చెల్లదు...

* తల్లికి నెలకు రూ.2,500 చొప్పున ముగ్గురు కుమారులూ జీవనభృతి చెల్లించాలి...

* తాతను మోసగించి, తన పేరుపై మనవడు చేయించుకున్న ఇంటి రిజిస్ట్రేషన్‌ చెల్లదు...

*తల్లికి రెండు నెలల్లో కుమారుడు ఇల్లు కట్టి ఇవ్వాలి.. తోటలపై వచ్చే ఆదాయం ఆమెకే చెందుతుంది...

ఇవీ రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్‌ స్థాయి ట్రైబ్యునళ్లు వెలువరించిన తీర్పులు. ట్రైబ్యునల్‌కు వెళ్తే తమకు న్యాయం జరుగుతుందని పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో... ఇటీవల ట్రైబ్యునళ్లను ఆశ్రయించే వారు పెరిగారు. రాష్ట్రంలోని ఇతరచోట్ల కంటే... విజయవాడ ట్రైబ్యునల్‌ ద్వారా తీర్పులు వేగంగా వస్తున్నందున ఆశ్రయించే వారు క్రమంగా పెరుగుతున్నారని కృష్ణా జిల్లా వృద్ధుల సంక్షేమ సంఘం వెల్లడించింది. హెల్పేజ్‌ ఇండియా ప్రతినిధులు... తమ ‘హెల్ప్‌లైన్‌’కు వచ్చిన అభ్యర్థనలను ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు.

విజయవాడ ట్రైబ్యునల్‌లో రక్షణ, పోషణ కేసులను విచారిస్తున్నారు. పిటిషన్‌ దాఖలు కాగానే ఛైర్మన్‌ ఇరుపక్షాలను పిలిపించి విచారిస్తున్నారు. తల్లిదండ్రులు ఓ పక్క... కుమారుడు/కుమార్తె మరోపక్క వాదనలు వినిపిస్తున్నారు. ఇక్కడ న్యాయవాది ఉండరు. వృద్ధుల అభ్యర్థన మేరకు పిల్లల నుంచి పోషణ, మనోవర్తి, రక్షణ(ఆస్తులు, వ్యక్తిగత) తదితరాలే కాక... వారిని ఆదరించని పక్షంలో గిఫ్ట్‌ డీడ్‌ల రద్దు వంటి తీర్పులనూ ఛైర్మన్లు ఇచ్చారు. తీర్పులను ధిక్కరించిన వారికి జైలు శిక్షలు విధిస్తున్నారు. కృష్ణాజిల్లాలో 2010 నుంచి ఇప్పటివరకు 600 మంది తల్లిదండ్రులు పిటిషన్లు దాఖలు చేస్తే... 500 వరకు విజయవాడ డివిజన్‌లోనే వచ్చినట్లు వృద్ధుల సంక్షేమ సంఘం తెలిపింది. ప్రస్తుత సబ్‌ కలెక్టర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌ 70 పిటిషన్లను పరిష్కరించారు. తానిచ్చిన ఆదేశాల మేరకు తండ్రిని ఇంట్లో ఉంచుకుని బాగోగులు చూడనందుకు ఓ కుమారుడికి రెండురోజులపాటు జిల్లా జైలులో ఉండాలని తీర్పు ఇచ్చారు. గడచిన మూడేళ్లలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం డివిజన్‌ ట్రైబ్యునల్‌లో 400 వరకు వృద్ధ తల్లిదండ్రుల నుంచి దరఖాస్తులు రాగా... 200 కేసుల్లో న్యాయం చేసినట్లు సభ్యులు తెలిపారు.

ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ...

నడవలేని.. కళ్లు కనిపించని పరిస్థితుల్లో సహాయకుల ఆసరాతో వృద్ధులు ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆస్తులు దక్కించుకుని తల్లిదండ్రులను చూడకపోవడం, ఆస్తుల విభజనలో కుమార్తెలు/కుమారుల మధ్య గొడవలతో వేధింపులకు గురవుతున్నామని వాపోతున్నారు. వృద్ధ తల్లిదండ్రులకు సేవలు చేయడానికి ముందుకురాని కుమారులపైనా కేసులు నమోదవుతున్నాయి. తల్లిదండ్రులను తిట్టే, కొట్టే వారూ ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో తనను కుమారుడు పట్టించుకోలేదని, విడిగా ఉంటున్న తనను పలుకరించలేదని, మందులు ఇచ్చేందుకూ రాలేదని ఓ తల్లి విచారణ సమయంలో చెప్పడం అక్కడి వారిని కంటతడిపెట్టించింది. ఇప్పుడు తన వద్దకు వస్తే తీసుకువెళ్తానని కుమారుడు చెప్పినా ఆమె వెళ్లనంది.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన తల్లిదండ్రుల పోషణ-వృద్ధుల సంక్షేమ చట్టం-2007 అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం 2011లో నిబంధనలు రూపొందించింది. ఇందులో భాగంగా...

*ఆర్డీఓ/సబ్‌ కలెక్టర్‌ ఛైర్మన్‌గా రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ట్రైబ్యునల్స్‌ ఏర్పడ్డాయి. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని దరఖాస్తురూపంలో పిటిషన్‌గా రూపాయి ఖర్చు లేకుండా ఛైర్మన్‌ దృష్టికి తీసుకువెళ్లొచ్చు.

* ట్రైబ్యునల్‌ 90 రోజుల్లోగా పరిష్కారం చూపాలి. అవసరమైతే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొచ్చు. ట్రైబ్యునల్‌ తీర్పుపై సంతృప్తి చెందకపోతే కలెక్టర్‌ నేతృత్వంలోని అప్పిలేట్‌ అథారిటీని సంప్రదించొచ్చు.

* 60 ఏళ్లు దాటిన వారు తమ సమస్య పరిష్కారానికి ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. పిల్లలు మేజర్లు అయి ఉండి... పట్టించుకోకపోతే సంబంధిత తల్లిదండ్రులూ ట్రైబ్యునల్‌ను సంప్రదించవచ్చు.

* ట్రైబ్యునల్‌కు ఛైర్మన్‌గా ఆర్డీఓ/సబ్‌ కలెక్టర్‌, మెంబర్‌ కన్వీనరుగా వృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌, వృద్ధుల నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు.

* న్యాయవాది అవసరం లేదు. ఎవరి కేసును వారే వాదించుకోవచ్చు. బాధితులు నేరుగా రాకపోయినా సేవా సంస్థలు లేదా శ్రేయోభిలాషుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నామమాత్రంగానే..

మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా... తగిన ప్రచారం లేకపోవడం, అధికారుల పట్టించుకోనందున చాలాచోట్ల ట్రైబ్యునల్స్‌ కార్యకలాపాలు నామమాత్రంగా ఉన్నాయి. ఇందుకు భిన్నంగా విజయవాడ, నరసాపురం డివిజన్‌ ట్రైబ్యునల్స్‌ ముందుకు సాగుతున్నాయి. వృద్ధుల సంక్షేమ సంఘాలు చురుగ్గా ఉన్నచోట బాధితులు ఎక్కువ సంఖ్యలో ట్రైబ్యునల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వీటికి ప్రాధాన్యం పెరిగితే... ఎక్కువ మంది బాధిత వృద్ధులకు పోషణతోపాటు ఆర్థికంగా చేయూత, మనోధైర్యం లభిస్తాయి.

చట్టప్రకారం తీర్పులు

పిటిషన్‌లు దాఖలయ్యాక ఇరుపక్షాల గురించి శాఖాపరంగా సమాచారాన్ని సేకరిస్తున్నాం. రెవెన్యూ సిబ్బంది, మహిళా పోలీసులను భాగస్వాములను చేస్తున్నాం. తీర్పులు తప్పక అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ చట్ట పరిధిలోనికి వృద్ధుల కుమార్తెలు, కుమారులే కాకుండా, మనవళ్లూ మనవరాళ్లు వస్తారు.- జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, ఛైర్మన్‌, విజయవాడ ట్రైబ్యునల్‌

సద్వినియోగం చేసుకోవాలి

ట్రైబ్యునల్‌ తీర్పులను కొన్నాళ్ల తర్వాత కొందరు అనుసరించడం లేదు. ఈ విషయం తెలియగానే ట్రైబ్యునల్‌ చర్యలు తీసుకుంటోంది. కొన్ని డివిజన్‌లలో అవగాహన లేమి వల్ల సద్వినియోగం చేసుకోవడం లేదు.- మోత్కూరి వెంకటేశ్వరరావు, ట్రైబ్యునల్‌ సభ్యుడు

ప్రత్యేక దృష్టి అవసరం

చట్టం వృద్ధులకు అనుకూలంగా ఉంది. సబ్‌ కలెకర్లకు బాధ్యతలు ఎక్కువగా ఉన్నందున కోర్టుల నిర్వహణకు తగిన సమయాన్ని కేటాయించలేక పోతున్నారు. కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా ఉన్నత స్థాయిలో ప్రత్యేక దృష్టి అవసరం. - దుర్గాప్రసాద్‌, నరసాపురం ట్రైబ్యునల్‌ సభ్యుడు, పశ్చిమగోదావరి జిల్లా

ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడింది: కేంద్ర ఆర్థిక శాఖ

Last Updated : Mar 20, 2022, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details