ఓపెన్ పది, ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. వీటిల్లో స్త్రీలు అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. పది, ఇంటర్ రెండు ఫలితాల్లోనూ అతి తక్కువ ఉత్తీర్ణత శాతంలో నెల్లూరు జిల్లా వెనుకబడి ఉంది.
2018-19 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఓపెన్ పదో తరగతికి మొత్తం 58,867 మంది నమోదు చేసుకోగా 56,149 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 39,263 మంది పాస్ కాగా ఉత్తీర్ణత శాతం 69.93గా ఉంది. ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 64, 279 మంది నమోదు చేసుకోగా 60,997 మంది పరీక్షకు హాజరయ్యారు. 41, 367 మంది పాస్ కాగా... ఉత్తీర్ణత శాతం 67.82 లభించిందని మంత్రి తెలిపారు.
స్త్రీల ప్రతిభ
ఈ పరీక్షల్లో స్త్రీలు ప్రతిభకనబరిచారు. ఓపెన్ పదో తరగతిలో వారి ఉత్తీర్ణత శాతం 73 శాతం, ఇంటర్లో 70 శాతంగా ఉంది. పురుషులు
67.58 శాతం, ఇంటర్లో 66 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి వివరాలు వెల్లడించారు.
ప్రకాశం ఫస్ట్
ఓపెన్ పది పరీక్ష ఫలితాల్లో ప్రకాశం జిల్లా 92.65 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానం సంపాదించుకుంది. ఇంటర్ ఫలితాల్లో గుంటూరు జిల్లా 83.75 స్థానం ఉత్తీర్ణతతో మొదటి స్థానం సాధించింది. రెండు ఫలితాల్లోనూ నెల్లూరు జిల్లా చివరి స్థానం సాధించింది.
ఈ ఏడాది కోర్సులు
2019-2020 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ పది, ఇంటర్‌కు సంబంధించి 28-06-2019 నుంచి 15-09-2019 వరకు ఆన్లైన్ ద్వారా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు. అలాగే ఈఏడాది సిలబస్‌లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు.