NTR Political journey: తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ కొట్టిన హిట్ అలాంటిలాంటిది కాదు..! తెలుగు రాజకీయాల ప్రస్తావన వస్తే.. ఎన్టీఆర్ కి ముందు, ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకోవాల్సిందే. ఆయన రాజకీయ ప్రవేశం.. తెలుగునాట రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. అప్పటిదాకా ఉన్న రాజకీయ పద్ధతులు, విధానాలు, నాయకుల వ్యవహారశైలిని.. సమూలంగా ప్రక్షాళన చేసింది. రాజధానికే పరిమితమైన రాజకీయాన్ని ప్రజల మార్గం పట్టించి.. ఊరూవాడ చైతన్యం రగిలించి.. ప్రజా రాజకీయానికి నాందీ ప్రస్తావన చేసి.. పదవీ రాజకీయాలను పాతిపెట్టి.. జనరంజక పాలనకు శ్రీకారం చుట్టింది.
తెలుగుదేశం పిలుస్తోంది - కదిలిరా :1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించి, మనదేశం సినిమాతో చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ .. ప్రజాభిమానంతో వెండితెర వేల్పుగా ఎదిగారు. మూడున్నర దశాబ్దాలపాటు "రారాజు"లా తెలుగు తెరను ఏలిన ఎన్టీవోడు.. తనను ఇంతటి వాణ్ని చేసిన ప్రజలకు ఏదైనా చేయాలనే కాంక్షతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1982 మార్చి 29న హైదరాబాద్ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా పార్టీ ప్రకటన చేశారు. నేను తెలుగువాడిని.. నాది తెలుగుదేశం పార్టీ అని ఘనంగా ప్రకటించారు. "తెలుగుదేశం పిలుస్తోంది - రా కదిలిరా" అంటూ ఆరు కోట్ల ఆంధ్రులకు పిలుపునిచ్చారు.
9 నెలల్లోనే అఖండ విజయం :అలా పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగు రాజకీయాలకు కొత్త నడకలు నేర్పింది. మూస ధోరణులకు స్వస్తి పలికి.. నవ్యపథంలో అడుగులు వేసింది. "మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ" అంటూ ఆనాటి ఏలికలు ఎగతాళి చేసినా.. వాటన్నింటినీ తోసిరాజని కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని విధంగా.. భవిష్యత్తులో ఇంకెవరికీ సాధ్యంకాని రీతిలో.. పార్టీ ప్రారంభించిన 9 నెలల కాలంలోనే సంచలన విజయం సాధించింది. మూడున్నర దశాబ్దాల అప్రతిహత విజయాలతో తిరుగులేదనుకున్న కాంగ్రెస్ పార్టీకి.. తొలిసారిగా ఓటమి రుచి చూపించింది.
కంచుకోటలు బద్ధలు : తెలుగు రాజకీయ చైతన్య కరదీపికగా, వెనుకబడిన వర్గాలకు ఆలంబనగా, ప్రగతిశీల రాజకీయాలకు దర్పణంగా.. సంక్షేమం, అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లిన ఎన్టీఆర్.. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదాన్ని బలంగా వినిపించారు. అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యను రాజీవ్‌గాంధీ అవమానించిన ఘటన.. తెలుగు ప్రజల్ని తీవ్రంగా గాయపర్చింది. ఈ అంశాన్ని అందిపుచ్చుకున్న ఎన్టీఆర్.. విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. తెలుగువాడి ఆత్మగౌరవానికి, దిల్లీ అహంభావానికి పోరాటమంటూ నినదించారు. ఈ నినాదమే తెలుగునాట రాజకీయ సునామీ సృష్టించడంలో కీలకంగా నిలిచింది. కాంగ్రెస్ కంచుకోటల్ని బద్దలు కొట్టింది. దిల్లీ సుల్తానులను గడగడలాడించింది.
అనితర సాధ్యమైన ఘనత : పార్టీ పురుడు పోసుకున్న 9 నెలల్లో.. మూడొంతులకు పైగా స్థానాలతో అధికార పీఠాన్ని అధిష్టించడమంటే సాధారణ విషయం కాదు. మహామహా రాజకీయ పండితులనే ఆశ్చర్యపరిచిన ఈ రాజకీయ ప్రకంపన ఎలా సాధ్యమైంది..?.. తెలుగు నేలకు దూరంగా ఉన్న ప్రతిఒక్కరి మదినీ తొలచిన ప్రశ్న ఇదే. అయితే తెలుగు గడ్డపై ఏం జరుగుతుందో దగ్గరి నుంచి గమనించిన వారందరికీ.. తెలుగుదేశం విజయం అనూహ్యమేమీ కాదు. ఎందుకంటే.. తెలుగుదేశం చరిత్రాత్మక విజయానికి ఏకైక కారణం ఎన్టీఆరేనని అందరికీ తెలుసు. పార్టీ ప్రారంభం నుంచి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అన్నట్లుగా.. అనుక్షణం జనంలో ఉంటూ.. ప్రజానాడి పట్టిన రాజకీయ వైద్యుడు ఎన్టీఆర్ అని తెలుగునాట ఉన్న వారందరికీ చిర పరిచితమే.