‘జగన్ రెడ్డి పిరికివారు. అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు. అదీ ఒక గెలుపేనా? అక్రమ కేసులు, బెదిరింపులతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా నాయకులు, పార్టీ కార్యకర్తలు పోరాడుతున్నారు. పౌరుషం ఉన్న పార్టీ తెలుగుదేశం. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేయండి’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాదయాత్రలో పెంచుతూ పోతానని చెప్పిన మాటకు ఇప్పుడు అర్థం తెలుస్తోందని.. నూనెలు, పప్పుఉప్పులు, పెట్రోల్, గ్యాస్, చింతపండు ధరలు పెంచడమే ఆయన ఉద్దేశమని ఎద్దేవా చేశారు.
జగన్ రెడ్డీ.. అదీ ఒక గెలుపేనా..?: నారా లోకేశ్ - అదీ ఒక గెలుపేనా
ఒంగోలు డెయిరీ మూయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన..బెదిరించి చేసుకున్న ఏకగ్రీవాలను గెలుపు అంటున్నారని ఆక్షేపించారు. జగన్‌పై దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కేసులు ఉన్నాయని విమర్శించారు.
ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చినట్టే ఇచ్చి జరిమానాల రూపంలో రూ.20 వేలు నొక్కేస్తున్నారని ఆరోపించారు. ఇంటింటికీ రేషన్ అని కోట్లు పెట్టి వాహనాలు కొన్నారని, ఇప్పుడు జనాన్ని రోడ్డుపైకి తెచ్చారని విమర్శించారు. దిల్లీని గడగడలాడిస్తానన్న జగన్.. కేంద్ర ముందు మెడలు వంచి తనపై ఉన్న కేసులను విచారించకుండా ఆపాలని మొక్కుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌రెడ్డి గ్యాంగుల కోసం ఇంటర్‌పోల్ కూడా వేటాడుతోందన్నారు. రోడ్‌షోలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'అవివాహిత' కుమార్తెనే అర్హురాలంటూ ఎలా చెబుతారు..?: హైకోర్టు