తెదేపా పాలనలో ఎస్సీలపై దాడి చేయాలంటే భయపడేవారు: నక్కా
వైకాపా నేతలే ఎస్సీ ద్రోహులని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ఎస్సీలపై తెదేపా నేతలెవరూ దాడులు చేయలేదని గుర్తు చేశారు.
తెలుగుదేశం పాలనలో ఎస్సీలపై దాడి చేయాలంటే భయపడేవారని.. జగన్‌రెడ్డి పాలనలో భయం పోయి వైకాపా నేతలు, పోలీసులు కూడా యథేచ్ఛగా దాడులు చేస్తున్నారని తెదేపా నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. పల్నాడులోని ఆత్మకూరులో 120 మంది ఎస్సీలను ఊరి నుంచి వెళ్లగొట్టిన ఘటన, తూర్పుగోదావరి జిల్లాలో వరప్రసాద్ శిరోముండనం, ఎస్సీలపై దాడులు, హత్యలు జరుగుతుంటే జగన్ ఎందుకు మౌనం పాటించారని ప్రశ్నించారు. ఏడాది క్రిందే స్పందించి వుంటే ఇన్ని దారుణాలు జరిగేవా అని నిలదీశారు. బోటు ప్రమాదంలో లోపాలు ఎత్తి చూపినందుకు మాజీ ఎంపీ, ఎస్సీ నేత హర్షకుమార్‌పై తప్పుడు కేసు పెట్టి 48 రోజులు అక్రమంగా జైలులో నిర్బంధించారని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.