ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MP RRR: సజ్జలపై చర్యలకు సీఎస్‌ను ఆదేశించండి.. - సజ్జలపై ఆర్​ఆర్​ఆర్​ వ్యాఖ్యలు

నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించనుందుకు.. ప్రభుత్వ సలహాదారు సజ్జలపై.. చర్యలు తీసుకునేలా ను ఆదేశించాలంటూ.. ఎంపీ రఘురామ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వైకాపా, ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రకటనలివ్వకుండా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. వ్యాజ్యంపై హైకోర్టు విచారించగా.. వాదనలకు సంబంధిత న్యాయవాది రాలేకపోయారని.. మరో రోజుకు వాయిదా వేయాలని మరో న్యాయవాది కోరటంతో.. వ్యాజ్యంపై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.

mp raghu ram pill in ap high court against sajjala
mp raghu ram pill in ap high court against sajjala

By

Published : Sep 9, 2021, 8:27 AM IST

నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించనందున రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ‘ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ (ప్రవర్తన)’ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. వైకాపా, ప్రభుత్వం తరఫున పత్రికా సమావేశాలు, ప్రకటనలు చేయకుండా సజ్జలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఏపీ సీఎస్‌, సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. వాదనలు వినిపించేందుకు సంబంధిత న్యాయవాది గైర్హాజరు కావడంతో విచారణను వారం రోజులపాటు వాయిదా వేయాలని మరో న్యాయవాది కోరగా, ధర్మాసనం అంగీకరించింది.

వ్యాజ్యంలో ఏముందంటే?

‘సజ్జల రామకృష్ణారెడ్డి వైకాపాకు చెందినవారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక సలహాదారుగా ఉంటూ ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, మరో మూడు జిల్లాలకు ఇన్‌ఛార్జిగానూ వ్యవహరిస్తున్నారు. వైకాపా కార్యాలయం నుంచి పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ తరఫున ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ పాత్ర పోషిస్తున్నారు. 2019 జూన్‌ 18న రాష్ట్ర ప్రభుత్వం జీవో 131 జారీచేస్తూ సజ్జలను ప్రజా సంబంధాల సలహాదారుగా నియమిస్తూ కేబినెట్‌ మంత్రి హోదా కల్పించింది. ఈ నియామకానికి పలు నిబంధనలను పేర్కొంది. సివిల్‌ పోస్టులో ఉంటూ, ప్రభుత్వం నుంచి జీతం, ఇతర ప్రయోజనాలు పొందుతున్న వారికి ‘ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ (ప్రవర్తన)’ నిబంధనలు వర్తిస్తాయి. నిబంధన 3 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి నిర్దిష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నిర్వహిస్తున్న పోస్టుకు మచ్చతెచ్చేలా వ్యవహరించకూడదు. ప్రత్యేక సలహాదారులు ‘తాత్కాలిక సివిల్‌ సర్వెంట్స్‌’ లాంటి వారు. సివిల్‌ సర్వెంట్ల మాదిరిగానే వీరు కూడా నిజాయతీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.

సజ్జల రామకృష్ణారెడ్డికి కేబినెట్‌ ర్యాంక్‌ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిబంధనలకు విరుద్ధం. కేబినెట్‌ ర్యాంకు పదవి కలిగిన వారు నెలకు రూ.2.5 లక్షల జీతం పొందుతున్నారు. అదనపు పోస్టుల్లోనూ కొనసాగుతూ మరో రూ.2.5 లక్షల ప్రోత్సాహకాలు అందుకుంటున్నారు. ఇవన్ని ప్రభుత్వ ఖజానాకు భారం కలిగించడమే. ప్రత్యేక సలహాదారులు తమ నియామక ఉద్దేశాలకు విరుద్ధంగా పని చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైకాపా భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేస్తూ ఎప్పుడూ మీడియాలో కనిపిస్తుంటారు. ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా.. వైకాపాకు అనుకూలంగా మాట్లాడారు. ఏపీలో ప్రత్యేక సలహాదారులకు ప్రత్యేకంగా ప్రవర్తన నియమావళి లేనప్పటికీ.. జీతాలు, ఇతర ప్రయోజనాలు ప్రభుత్వ ఖజానా నుంచి పొందుతున్నందున వారికి ‘ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌’ వర్తిస్తాయి. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఆయనపై చర్యలు తీసుకునేలా ఏపీ సీఎస్‌ను ఆదేశించండి’ అని కోరారు.

ఇదీ చదవండి:

28 రోజుల్లోనే 100 పడకల ఆసుపత్రి.. ఎక్కడో తెలుసా..!

ABOUT THE AUTHOR

...view details