Jubilee hills gang rape case: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చాయి. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు.. అత్యాచారం అనంతరం కారులో మొయినాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్‌లో ఆశ్రయం పొందారని తెలుస్తోంది. ఆ ఫాంహౌస్ నుంచే నిందితులు వేర్వేరు చోట్లకు పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఫాంహౌస్ వెనక కారును దాచిన నిందితులు.. అక్కడే కారుకు ఉన్న ప్రభుత్వ వాహన స్టిక్కర్‌ను తొలగించారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫాంహౌస్ యజమాని అయిన రాజకీయ నేతను పోలీసులు ఆరా తీస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
Gang Rape on Girl: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో.. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... గత నెల 28న ఓ బాలిక (17) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చింది. దాదాపు 150 మంది 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే మద్యం రహిత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ ముగిసే సమయానికి పావుగంట ముందు పబ్ నుంచి బాలిక బయటకు వచ్చింది.