MLC Btech RAVI ON NARCO TEST IN VIVEKA MURDER CASE: ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డిలకు.. వివేకా హత్యతో సంబంధం లేదనే అంశంపై నార్కో అనాలసిస్ పరీక్షలకు సిద్ధమా అని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి సవాల్ చేశారు. సీబీఐ నార్కో అనాలసిస్ పరీక్షలకు అనుమతి కోరుతూ పిటిషన్ వేసినందున.. ఎంపీ ఎందుకు దానిని సదావకాశంగా భావించట్లేదని నిలదీశారు. నిజంగా హత్యతో సంబంధం లేకుంటే నార్కో అనాలసిస్ పరీక్షలు ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటకు రావొచ్చుగా అని ప్రశ్నించారు.
ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డిలకు హత్యతో సంబంధం ఉంది కాబట్టే.. నార్కో అనాలసిస్ పరీక్షలకు వెనుకంజ వేస్తున్నారని బీటెక్ రవి ఆరోపించారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి తీరుతో ముఖ్యమంత్రికి కూడా వివేకా హత్యలో పాత్ర ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో చంద్రబాబుతో పాటు తనపైనా, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి పైనా వైకాపా నేతలు ఆరోపణలు చేశారన్న బీటెక్ రవి.., నార్కో పరీక్షలకు తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. పులివెందుల ప్రజలందరి ముందు నార్కో అనాలసిస్ పరీక్షలు ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.