కరోనా విజృంభిస్తున్న తరుణంలో పాఠశాలల పునః ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని కోరుతూ రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా రెండో దశ ప్రారంభమైందని.. లక్షల మంది కరోనా బారిన పడుతున్నారని అన్నారు. విద్యార్థుల రక్షణ దృష్ట్యా.. ఇతర దేశాల్లో పాఠశాలల నిర్వహణ వాయిదా వేశారని, మన దేశంలోనూ 22కు పైగా రాష్ట్రాల్లో బడులు ఇప్పటికీ తెరవలేదనీ వివరించారు.
విద్యార్ధులకు కరోనా వైరస్ సోకితే ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం తల్లిదండ్రుల నుంచి డిక్లరేషన్ తీసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. విద్యార్ధుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టిన పైబర్ గ్రిడ్‌ను ప్రభుత్వం సమర్థవంతంగా ఉపయోగించినట్లయితే ఆన్లైన్లోనే పాఠాలు బోధించే అవకాశం ఉండేదన్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల పాఠశాలలు ప్రారంభించిన మూడు రోజుల్లోపే 240 మంది పైగా టీచర్లు, వందలాది మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారని చెప్పారు.