విజయవాడలోని శాప్ కార్యాలయం నుంచి మంత్రి శ్రీనివాసరావు, ఇతర అధికారులతో కలిసి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. చిత్తూరులో రెండు, తిరుపతి, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాలు, అనుబంధ క్రీడా రంగాలకు చెందిన మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.
వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, క్రికెట్ మైదానం, స్కేటింగ్, హాకీ మైదానం కోసం రూ.35.44 కోట్ల రూపాయలతోనూ.. తిరుపతి, రాజమహేంద్రవరంలలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, సింథటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ కోసం రూ.20.1 కోట్లతోనూ... కృష్ణా జిల్లా పామర్రులో ఎనిమిది కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం కోసం పంపించిన ప్రతిపాదనలను పరిశీలించి.. నిధుల మంజూరుకు ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.
కొవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని-కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 40 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన పనులను చేపట్టలేకపోయినందున- తిరిగి వాటికి ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ విద్యాధరపురంలో 25 కోట్ల రూపాయలతో చేపట్టాల్సిన బహుళ ప్రయోజన ఇండోర్ హాలు నిర్మాణానికి... అలాగే మచిలీపట్నంలో స్విమ్మింగ్ పూల్, ఇతర పనులకు మంజూరు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. విశాఖలోని కొమ్మాది ప్రాంతంలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం పూర్తి చేయడానికి మరో ఏడాది సమయం పెంచాలని కోరారు.
పశ్చిమగోదావరి జిల్లా బీమడోలులో మల్టీపర్పస్ ఇండోర్ హాలు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చేపట్టాల్సిన పనుల ప్రారంభానికి ఏడాది సమయం కోరారు. కడప జిల్లాలో కేంద్రం అమలు చేస్తున్న ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి శ్రీనివాసరావు కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి సానుకూలంగా స్పందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో శాప్ ఎండీ బి. రామారావు, యువజన సేవల కమిషనర్ నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వేర్పాటు ఉద్యమాలు రాకూడదనే... మూడు రాజధానులు: అవంతి