Minister Avanthi On AP Tourism: రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధి కోసం పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 2022 జనవరిలో విశాఖ లేదా విజయవాడలో ఈ సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలపై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఐదు నక్షత్రాల హోటళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఇన్వెస్టర్ల సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
విదేశాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం.. పర్యాటకశాఖకు ఇస్తున్న దర్శనం టికెట్లను 2 వేలకు పెంచాల్సిందిగా తితిదేని కోరినట్లు వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి పర్యటకులను ఆకర్షించేలా రాష్ట్రవ్యాప్తంగా 38 టూరిజం బోట్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా.. పోచారం, నాగార్జున సాగర్లలోనూ బోట్ ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు.