విజయవాడ కొవిడ్ ఆస్పత్రిపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి కరోనా బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందే సేవలపై కొవిడ్ బాధితులు సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఏ సమస్యలున్నా తన దృష్టికి తేవాలని వైద్యులకు సూచించారు. బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. పూర్తిగా కోలుకునే వరకూ అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఒక్కో కరోనా బాధితునికి ఆహారానికి రోజుకు రూ.500 కేటాయించామని మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఆహార సరఫరాలో అవినీతి చేస్తే గుత్తేదారులను వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు. టెస్టుల సంఖ్య పెంచడం వల్ల ఫలితాల వెల్లడిలో జాప్యం నిజమేనని మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో ఒకట్రెండు ఫలితాలు తప్పుగా వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందన్న ఆయన.. మరోసారి తప్పుడు రిపోర్టు వస్తే లైసెన్స్ రద్దుకు వెనకాడబోమని స్పష్టం చేశారు.