రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థుల పరీక్షలు ఎన్నికల కారణంగా ఒకసారి, కరోనా వైరస్ నేపథ్యంలో మరోసారి వాయిదా పడ్డాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ గుర్తు చేశారు. ఇవాళ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు, ప్రాజెక్టు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారులతో జరిగిన ఈ సమావేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు పాఠ్యంశాల బోధన, నాడు-నేడు కార్యక్రమంలో పాఠశాలల అభివృద్ధి, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై మంత్రి సురేశ్ చర్చించారు. కరోనా వైరస్ వ్యాపి చెందుతున్నందున పదో తరగతి విద్యార్థులకు విద్యా అమృతం పథకం కింద ప్రతి రోజు దూరదర్శన్ ఛానల్లో ఉదయం10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బోధనా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ద్వారా కూడా పాఠాలు వినిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థులకు ఆకాశవాణి ద్వారా ఆడియో పాఠాలు
రాష్ట్రంలో ఇప్పటికే సప్తగిరి ఛానెల్ ద్వారా పదో తరగతి విద్యార్థులకు పాఠాలు వినిపిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఆకాశవాణి ద్వారా ఆడియో పాఠాలు వినిపించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కరోనా వైరస్ పరిస్థితులను సమీక్షించుకొని 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సురేశ్ తెలిపారు. రాష్ట్రంలో నాడు- నేడు కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే త్వరితగతిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లాక్ డౌన్ సమయంలో పోలీసులు అందిస్తున్న సేవల్లో ఉపాధ్యాయులూ భాగస్వాములవడాన్ని మంత్రి సురేశ్ అభినందించారు.
ఇదీ చదవండి: వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించండి: సీఎం జగన్