ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chalo Vijayawada: మధ్యాహ్న భోజన కార్మికుల 'చలో విజయవాడ'.. పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత - CITU on CHALO Vijayawada

CHALO Vijayawada: మధ్యాహ్న భోజన కార్మికుల 'చలో విజయవాడ'లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో పలువురిని గృహ నిర్బంధం చేయడమే కాకుండా.. మరికొంతమందిని కార్యక్రమానికి హాజరుకాకుండా అరెస్టులు చేశారు. దీంతో పోలీసులు, కార్మిక సంఘాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. పలువురిని బలవంతంగా అరెస్ట్​ చేశారు. సమస్యలపై పోరాడితే అక్రమంగా అరెస్టు చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

CHALO Vijayawada
మధ్యాహ్న భోజన కార్మికుల 'చలో విజయవాడ'.. పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత

By

Published : Mar 14, 2022, 4:24 AM IST

Updated : Mar 14, 2022, 12:40 PM IST

మధ్యాహ్న భోజన కార్మికుల 'చలో విజయవాడ'.. పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత

CHALO Vijayawada: మధ్యాహ్న భోజనం అక్షయపాత్రకు ఇవ్వడాన్ని నిరసిస్తూ.. కార్మికులు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. ఏఐటీయూసీ, సీఐటీయూ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఎలాంటి ఆందోళనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ దాసరి భవనం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చలో విజయవాడకు వెళ్తున్న ఏఐటీయూసీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు కొంతమంది నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

విజయవాడ ధర్నా చౌక్ కి వెళ్తున్న కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి బస్సుల్లో ఎక్కించారు. దీంతో పోలీసులకు.. మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం తమపై నిరంకుశ వైఖరి అవలంభిస్తోందని కార్మికులు వాపోయారు. పోలీసుల తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై పోరాడితే అక్రమంగా అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దాదాపు 40 వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయని.. వాటిలో 88 వేల మంది పని చేస్తున్నట్లు కార్మికులు తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని అక్షయపాత్ర సంస్థకు ఇవ్వడం వల్ల తమ ఉపాధి దెబ్బతిందని వాపోతున్నారు. నిరసనను అడ్డుకోవద్దని కోరుతున్నారు.

కృష్ణా జిల్లా సీఐటీయూ ఆధ్వర్యంలో విజయవాడకు బయలుదేరిన మధ్యాహ్న భోజన కార్యకర్తలను తెల్లవారుజాము నుంచే పోలీసులు అరెస్టు చేశారు. వీరందర్నీ నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులు నిర్బంధించారు. చలో విజయవాడకు వెళ్తున్నారన్న సమాచారం మేరకు మహిళలను బలవంతంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ప్రభుత్వం ఏకపక్షంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ బాధ్యతలను అక్షయపాత్రకు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కొనసాగించాలని డిమాండ్ చేశారు.

కృష్ణా జిల్లా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. చలో విజయవాడకు తరలివచ్చే మధ్యాహ్న భోజన కార్మికులను ఆపేందుకు.. తనిఖీలు చేస్తున్నారు. ఉంగుటూరు మండలం పొట్టిపాడు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు.

విజయవాడలో..

విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లో మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ నగరంలోని కార్మిక సంఘాల నాయకుల ఇళ్ల ముందు కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో పాటు ధర్నా చౌక్ లో కూడా వందల మంది పోలీసులతో ఉన్నతాధికారులు భద్రత చర్యలు చేపట్టారు. విజయవాడ దాసరి భవనం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏఐటీయూసీ నాయకులు ధర్నాకు బయల్దేరుతుండగా.. పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది.

కార్మికుల నిర్భందం

కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో.. మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులను నిర్బంధించారు. చలో విజయవాడకు వెళ్తున్న సీఐటీయూ నాయకులు సహా పలువురుని అరెస్టు చేశారు.

కర్నూలులో నిరసన

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సింగరాజుపల్లి అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న హరిత అనే మహిళ.. కొత్తపల్లి మండలం అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలిగా కొనసాగుతున్నారు. ఆదివారం తన పొలంలో పని చేసుకుంటుండగా "చలో విజయవాడ" కార్యక్రమానికి వెళుతున్నారంటూ ఎస్‌ఐ ముబీనా తాజ్‌ కానిస్టేబుళ్లతో కలిసి పొలం వద్దకు వెళ్లి.. నానా దుర్భాషలాడి బలవంతంగా జీపు ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సుమారు మూడు గంటలకు పైగా ఠాణాలోనే కూర్చోబెట్టినట్లు బాధితులు ఆరోపించారు. దీనికి నిరసనగా ఆత్మకూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎస్ఐను సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు.

అనంతపురంలో పోలీసుల అదుపులో మహిళా కార్మికులు

అనంతపురంలో మహిళా కార్మికులను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తుంటే.. బలవంతంగా అడ్డుకోవడం ఏంటని సీఐటీయూ నేతలు ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగితే పోలీసులతో అరెస్టు చేయించడం దారుణమని.. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ అన్నారు. జగన్‌ ఒక నియంతలా ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు.

శ్రీకాకుళంలో పోలీసుల అడ్డగింపు

శ్రీకాకుళం జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అంగన్వాడీ యూనియన్ మండల, డివిజన్, జిల్లా శాఖ ముఖ్య నేతలను గృహనిర్బంధం చేశారు. ఆదివారం ఉదయం నుంచి వారి ఇళ్లకు వెళ్లి హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు.. వారి కదలికలపై నిఘా పెట్టారు. చలో విజయవాడకు పిలుపునిచ్చిన ఆశ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వెలుగు యానిమేటర్లు, క్లాస్-4 ఉద్యోగులు, వీఆర్ఎలపై ప్రత్యేక దృష్టిసారించారు. వీరికి సంబంధించి విధులకు హాజరవుతున్నదీ.. లేనిదీ హాజరును కలెక్టరేట్ కు పంపాలని సంబంధిత జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కార్మికుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు.. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి:

'జగన్ అహంకారం, సామాన్యుల ఆత్మగౌరవానికి మధ్య పోరాటమే.. జనసేన ఆవిర్భావ సభ'

Last Updated : Mar 14, 2022, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details