ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ESMA: అసలేమిటీ 'ఎస్మా'.. ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే ఏమవుతుంది ?

ESMA: పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు ప్రకటించిన సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ వైపు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు కొనసాగుతుండగా.. మరోవైపు ఎస్మా ప్రయోగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలేమిటీ ఎస్మా చట్టం ? దీనికి ఉన్న విస్తృతి ఏమిటి ? ఎస్మా ప్రయోగిస్తే ఏమవుతుంది తదితర అంశాలు ఆసక్తికరంగా మారాయి.

అసలేమిటీ 'ఎస్మా
అసలేమిటీ 'ఎస్మా

By

Published : Feb 5, 2022, 7:38 PM IST

ESMA: ప్రభుత్వ ఉద్యోగుల భారీ సమ్మె పిలుపులు వినబడే ప్రతిసారీ వినిపించే మాట ‘ఎస్మా’. తాజాగా రాష్ట్రంలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు ప్రకటించిన సమ్మెను విరమింపచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ వైపు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు కొనసాగుతుండగా.. మరోవైపు మైనింగ్ శాఖపై ఎస్మా ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేయడం ఉద్యోగుల్ని విస్మయపరుస్తోంది. ఈ నేపథ్యంలో అసలేమిటీ ఎస్మా చట్టం ? దీనికి ఉన్న విస్తృతి ఏమిటి ? ఎస్మా ప్రయోగిస్తే ఏమవుతుంది తదితర అంశాలు ఆసక్తికరంగా మారాయి.

అసలేమిటీ ‘ఎస్మా’?

'ఎస్మా' అనేది 'ఎసెన్సియల్‌ సర్వీసెస్‌ మెయింట్​నెన్స్​ యాక్ట్‌'కు సంక్షిప్త రూపం. ఇది సమ్మెలు, హర్తాళ్లు వంటి సందర్భాల్లో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా.. కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981లో రూపొందించిన చట్టమిది. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే.. జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది.

ఎందుకొచ్చిందీ చట్టం?

1980లలో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికి పోయింది. ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉద్ధృత స్థాయిలో ఉద్యమించాయి. 1981లో కార్మిక సంఘాలు పార్లమెంట్‌ ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె కూడా చేయాలని పిలుపునిచ్చారు. క్రమంగా ఈ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. తొలుత 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ‘ఎస్మా’ ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్‌ స్థానంలో ‘ఎస్మా’ చట్టం తీసుకొచ్చింది.

ఈ చట్టం ప్రకారం అత్యవసర సేవలంటే ?

ప్రజల దైనందిన జీవితానికి అత్యవసరమని ప్రభుత్వం భావించిన ఏ సేవ అయినా అత్యవసర సేవగా పరిగణించి, ఆయా సేవలకు సంబంధించి ‘ఎస్మా’ వర్తిస్తుందని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ప్రధానంగా నీటి సరఫరా, ఆసుపత్రులు, పారిశుద్ధ్యం, రవాణా, తంతి తపాలాలతో పాటు పెట్రోలు, బొగ్గు, విద్యుత్‌, ఉక్కు, ఎరువుల వంటి వనరుల ఉత్పత్తి రవాణా పంపిణీ సేవలన్నింటికీ దీన్ని వర్తింపజేయవచ్చు. అలాగే, బ్యాంకింగ్, ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాల పంపిణీ వంటి వాటన్నింటికీ దీన్ని వర్తింపజేయొచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెను నిషేధిస్తున్నట్టు ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే.. ఇక ఆయా రంగాల్లో సేవలందించేవారు సమ్మె చేయడమనేది ‘చట్టవిరుద్ధ’ కార్యకలాపమవుతుంది. ఒకవేళ వారి సేవలు అత్యవసరమైనవైతే, అదనపు సమయం పని చేయడానికి తిరస్కరించే అధికారం కూడా వారికి ఉండదు.

ఎస్మాను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది?

ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపైనైనా బలమైన అనుమానం ఉంటే.. నేరశిక్షాస్మృతి(సీపీసీ)తో సంబంధం లేకుండానే.. పోలీసు అధికారులు వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్‌ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలూ చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్నవారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారూ శిక్షార్హులే!

గతంలో ఎస్మా ప్రయోగించిన సందర్భాలేవైనా ఉన్నాయా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మెలపై ‘ఎస్మా’ ప్రయోగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2003లో తమిళనాడు ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు జయలలిత ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దాదాపు 1,70,000 మందిని విధుల్లోంచి తొలగించారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత గానీ వారంతా తిరిగి విధుల్లో చేరలేకపోయారు. సమ్మె కట్టిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిపై ఉమ్మడి ఏపీ సహా దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఎస్మా ప్రయోగించారు. 2006లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విమానాశ్రయ సిబ్బంది సమ్మెకు దిగినప్పుడు, 2009లో ట్రక్కు రవాణాదారులు సమ్మె చేసినప్పుడు, 2009లో చమురు, గ్యాస్‌ సిబ్బంది సమ్మె చేసినప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో ఎస్మా ప్రయోగించారు.

ఇదీ చదవండి

హెచ్‌ఆర్‌ఏ స్లాబులపై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు.. ఉద్యోగ సంఘాల అభ్యంతరం!

ABOUT THE AUTHOR

...view details