రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య బీ, సీ కేటగిరీ సీట్ల ప్రవేశానికి.. మొదటి విడత కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 1 వరకు.. అభ్యర్థులు వెబ్ ఆప్షన్ల కసరత్తు పూర్తిచేయాల్సి ఉంటుందని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేర్కొంది. ఎంబీబీఎస్ ‘బీ’ కేటగిరీలో 886, ముస్లిం మైనార్టీలో 87, ముస్లిం మైనార్టీ కళాశాలలో 38 సీట్లను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. బీడీఎస్ కోర్సులో బీ కేటగిరీలో 454 సీట్లు, సీ కేటగిరీలో 196 సీట్లు ఉన్నాయి.
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల రెండవ విడత కౌన్సెలింగ్ ప్రక్రియా ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఇప్పటికే వెబ్ ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేశారు. మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన 175 సీట్లతో పాటు ఎన్‌సీసీ, ఆర్మీ, క్రీడా విభాగాలకు చెందిన 179 ప్రత్యేక కేటగిరీ సీట్లనూ కలిపి భర్తీ చేయనున్నారు.