AP SSC Results: పదో తరగతి ఫలితాల్లో 71 స్కూళ్లలో ఒక్కరూ ఉత్తీర్ణులు కాకపోవడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితాలపై స్పందించిన లోకేశ్.. అమ్మ ఒడి, సంక్షేమ పథకాలకి విద్యార్థుల్ని తగ్గించే కుట్రలో భాగంగానే అత్యధికుల్ని ప్రభుత్వం ఫెయిల్ చేసిందని లోకేశ్ ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వం నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో 94.48 శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. నేడు 67.26 శాతానికి దిగజారడమేనా వైకాపా ప్రభుత్వం సాధించిన ప్రగతి అని లోకేశ్ ప్రశ్నించారు.
టెన్త్ ఫలితాల్లో అత్యధికులు ఫెయిల్ కావడం.. ప్రభుత్వ కుట్రలో భాగమే : లోకేశ్ - ఏపీ ఎస్ఎస్సీ ఫలితాలు వెల్లడి
Lokesh on SSC Results: రాష్ట్రంలో విడుదలైన పదో తరగతి ఫలితాలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 71 స్కూళ్లలో ఒక్కరూ ఉత్తీర్ణులు కాకపోవడం, గత 20 ఏళ్లలో ఈసారి అతి తక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదు కావడంపై లోకేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కుట్రలో భాగంగానే పదో తరగతి ఫలితాల్లో అత్యధికుల్ని ఫెయిల్ చేసిందని ప్రభుత్వంపై లోకేశ్ ధ్వజమెత్తారు.
పదో తరగతి కష్టపడి చదివి పాసై ఉంటే.. విద్యార్థుల కష్టాలు తెలిసేవని సీఎంను ఉద్దేశించి లోకేశ్ ఎద్దేవా చేశారు. పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి.. ఫలితాల వెల్లడి వరకు అంతా అస్తవ్యస్తం, గందరగోళమే అన్నారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను తన మద్యం బ్రాండ్లు అమ్మే షాపులకి కాపలా పెట్టిన ముఖ్యమంత్రే.. ఈ దిగజారిన ఫలితాలకు ప్రధాన కారకుడని ఆరోపించారు. మీడియం గందరగోళం, ఎయిడెడ్ పాఠశాలల రద్దు, పరీక్ష పత్రాల తయారీ విధానంలో లోపాలతో 20 ఏళ్లలో ఎన్నడూ రాని దారుణ ఫలితాలు వచ్చాయన్నారు. ఒక్కరూ పాస్ కాని పాఠశాలలు 71 ఉన్నాయంటే.. పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం అవుతోందన్నారు. ప్రభుత్వం చేతకానితనం, మూర్ఖత్వం, కుట్రలకు లక్షలాది మంది విద్యార్థులు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ విఫలమే అన్నారు.
ఇదీ చదవండి: