జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని తన నివాసంలో మహాత్ముని చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
అహింస దారిలో నడిచి గాంధీ గెలిచారు..
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులు ఘటించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో అహింసా వాదాన్నే.. జాతి నినాదంగా మలిచిన మహనీయులు గాంధీజీ అని గుర్తుచేసుకున్నారు. చిత్తశుద్ధితో న్యాయం కోసం చేసే పోరాటానికి ఎంతటి నిరంకుశత్వమైనా తలవంచక తప్పదని మహాత్ముడు నిరూపించారని కొనియాడారు. గాంధీజీ స్పూర్తి తరువాతి మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమ, కొమ్మారెడ్డి పట్టాభిరాం, ఇతర నేతలు పాల్గొన్నారు.