వివాదాలకు తావివ్వకుండా పనిచేస్తామని నూతన డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. డీజీపీగా మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల విశ్వాసం చూరగొనేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు పోలీసుల వద్దకే వస్తారని..,కిందిస్థాయిలో తప్పు చేస్తే మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందన్నారు. మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాలకు వేగంగా సేవలు అందిస్తామన్నారు.
"ఎర్రచందనం స్మగ్లింగ్, గంజాయి సాగు నేరాలను అదుపుచేస్తాం. ప్రజాప్రతినిధుల సహకారంతో కుల, మత, వర్గ విభేదాలు పరిష్కరిస్తాం. ప్రభుత్వరంగ సంస్థలపై దాడులకు దిగే పరిస్థితి ఎక్కువవుతోంది. దాడులను ఉపేక్షించేదిలేదు..వివాదాలకు తావివ్వకుండా పనిచేస్తాం. త్వరలో మహిళా రక్షణ కార్యదర్శులు పోలీసు విభాగంలో చేరుతారు. వీఐపీల రాకపోకల వేళల్లో ప్రజలకు ఇబ్బందులపై.. అదనపు డీజీ స్థాయి అధికారి అధ్యయనం చేస్తున్నారు. జిల్లాల విభజన దృష్ట్యా పోలీసు అధికారుల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నాం" -రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ
అంతకుముందు.. మంగళగిరి ఆరో బెటాలియన్ గ్రౌండ్‌లో గౌతమ్ సవాంగ్ కోసం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. గౌతమ్ సవాంగ్ పనితీరు తనకు చాలా స్ఫూర్తినిచ్చిందని అన్నారు. తనను డీజీపీగా ఎంచుకున్నందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా విశ్వాసం పోలీసులకు ఎప్పుడూ శిరోధార్యమే అని అన్నారు. జిల్లా ఎస్పీలు అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు అత్యున్నత స్థాయి నమ్మకం ఉంటుందని.., ఆ నమ్మకానికి భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర ప్రభావం ఉంటుందని అన్నారు. ఎవరు తప్పుచేసినా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందన్నారు. తప్పుడు ఆరోపణలపై దిగులు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆరోపణలపై ఉన్నత స్థాయిలో విచారణ చేస్తామని.., పోలీసులు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని సూచించారు.
"గౌతమ్ సవాంగ్ పనితీరు నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. సవాంగ్ సేవలు గుర్తించి ఆయనకు మరో పదవి ఇచ్చింది. ప్రజా విశ్వాసం పోలీసులకు ఎప్పుడూ శిరోధార్యమే. పోలీసు వ్యవస్థపై ప్రజలకు అత్యున్నత స్థాయి నమ్మకం ఉంటుంది. ప్రజల నమ్మకానికి భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర ప్రభావం ఉంటుంది. తప్పుడు ఆరోపణలపై దిగులు చెందాల్సిన అవసరం లేదు. పోలీసులు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలి. డీజీపీగా నన్ను ఎంచుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు" - రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ