రాష్ట్రంలోని ఆలయాలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తనకు అనువుగా మార్చుకున్నారని జనసేన నేత పోతిన మహేశ్ విమర్శించారు. దేవాలయాల ఆస్తులను బినామీల ద్వారా తన పేరు మీదకు మార్చుకున్నారన్నారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో వెల్లంపల్లి అవినీతి, ఆక్రమణలు యథేచ్ఛగా సాగిస్తున్నారన్నారు.
"అవినీతితో మంత్రి సంపాదించిన ఆస్తుల విలువ వెయ్యి కోట్లు దాటిపోయింది. రంగనాథ స్వామి ఆలయానికి చెందిన రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన అనుచరులు దండుపాళ్యం గ్యాంగ్‌లాగా తయారయ్యారు. వన్‌టౌన్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం చుట్టుపక్కల ఉన్న దేవాదాయశాఖకు సంబంధించిన రూ.200 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. శేషమహల్ కనకవల్లి కాంప్లెక్స్‌లో 40 షాపులను మంత్రి ప్రోద్భలంతో ఆయన బినామీలు ఆక్రమించారు. దేవాదాయ శాఖకు సంబంధించిన గూడవల్లి, పోరంకి, యనమలకుదురు, ఉంగుటూరు ప్రాంతాల్లోని విలువైన భూములను మంత్రి అనుచరులు ఆక్రమించారు."
-పోతిన మహేశ్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి