పెట్టుబడులపై సహకారానికి కేంద్ర మంత్రులు, అధికారులను కలిశారు కదా. ఏం హామీలు వారి నుంచి వచ్చాయి.?
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టటంలో కేంద్రంలోని వివిధ శాఖల సహకారం కోరాం. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులనూ సంప్రదించాం. స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ లాంటి కీలకమైన సంస్థల ఎండీలు, సీఈఓలను కలిశాం. పర్యాటక మంత్రిత్వశాఖ అధికారులు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తోనూ సమావేశమయ్యాం. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, కేంద్ర నౌకాయాన మంత్రి మాన్సుఖ్ మాండవీయతో భేటీ జరిగింది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న నైపుణ్య కళాశాలల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సు కేంద్రాల ఏర్పాటుపై వారికి విజ్ఞప్తి చేశాం. వారి భాగస్వామ్యం కోరాం. దీనికి ఆయాశాఖలు అంగీకారాన్ని తెలిపాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా లేఖలు పంపాం. సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సు కేంద్రాల ఏర్పాటుపై మరో మూడు ప్రైవేటు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. మేం ఏర్పాటు చేసే 30 నైపుణ్య కళాశాలల్లో ఒక్కో చోట ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సు కేంద్రం రావాలన్నది మా ఆలోచన. దీంతో పాటు ఇతర నైపుణ్య కోర్సులు కూడా అందిస్తాం.రాష్ట్ర తీరప్రాంత అభివృద్ధికి సంబంధించి నౌకాయాన మంత్రి జరిగిన భేటీలో ఆయన కొన్ని హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 8 ఫిషింగ్ హార్బర్ జెట్టీల నిర్మాణంలో సహకారంతోపాటు డీప్ సీ ఫిషింగ్ బోట్లను రాయితీపై అందించేందుకు ముందుకు వచ్చారు. ఆ ప్రతిపాదన రాష్ట్రం నుంచి వస్తే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి ఆర్దిక సహకారం అందించాల్సిందిగా నీతిఆయోగ్ సీఈఓను కోరాం. దీనిపైనా ఏపీ నుంచి ప్రతిపాదనలు పంపుతున్నాం.
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువచ్చేకంటే నైపుణ్యాభివృద్ధిపైనే ఎందుకు దృష్టి పెట్టారు ?
ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర పరిశ్రమ సర్వే అని ఒకటి చేపట్టాం. ప్రస్తుతం పరిశ్రమల్లో పనిచేస్తున్న 70 శాతం మందికి సరైన నైపుణ్యాలు లేవని ప్రాథమికంగా తేలింది. వారికి నైపుణ్యాన్ని పెంచేందుకు వినతులు వస్తున్నాయి. అందుకే ప్రపంచస్థాయిలో నైపుణ్యం ఉన్న మానవ వనరుల్ని తయారు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఉంటే ఏ పరిశ్రమైనా మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడే పెట్టుబడులు పెడుతుంది. ప్రతీ పరిశ్రమ మూడే అంశాలు చూస్తుంది. శాంతిభద్రతలు, మౌలిక వనరులు, నైపుణ్యం ఉన్న మానవవనరుల గురించి ఆలోచించిన తర్వాతే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఈ మూడింటినీ ఏపీ అందించగలిగితే ఏ పెట్టుబడిదారైనా రావాల్సిందే. మేమెక్కడా పెట్టుబడులను తీసుకువచ్చే అంశాన్ని వెనక్కు పెట్టలేదు. ముందుగా మౌలికమైన అంశాలను సరిదిద్దితే వాటికవే పెట్టుబడులు వస్తాయన్నది మా ఆలోచన. ముందుగా పరిశ్రమలకు అవసరమైన అంశాలను అభివృద్ధి చేశాకే వారికి కేటాయిస్తామని చెబుతున్నాం.
పెట్టుబడుల గురించి పక్కన పెట్టి కేవలం నైపుణ్యాభివృద్ధిపైనే దృష్టిపెడితే పరిశ్రమలు వచ్చే లోపు వారు ఇతర ప్రత్యామ్నాయాలు వెతుక్కునే అవకాశం లేదా?