రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఆలయాల్లో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. గత పాలకమండళ్ల మాదిరిగానే ఈ పాలకమండలి కాలపరిమితి కూడా వివాదాలతోనే ప్రయాణం ముగుస్తోంది. ఆలయంలో వెండి సింహాల చోరీ, టెండర్ల విషయంలో అధిక జోక్యం, తమ వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు, సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు, అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సమీకరణలో వైఫల్యాలు.. ఇవే ఈ రెండేళ్లలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రతిసారి పాలకమండలి సమావేశంలో అనేక విషయాలపై నిర్ణయాలు చేస్తున్నా.. వాటిలో అమలు జరుగుతున్నవి అంతంత మాత్రమే ఉన్నాయి. చివరికి ప్రభుత్వం ప్రకటించిన 70 కోట్ల రూపాయల నిధులను కూడా త్వరితగతిన సాధించడంలో విఫలమయ్యారు.
పైలా సోమినాయుడు ఛైర్మన్‌గా 2020 ఫిబ్రవరి 21న.. 16 మందితో దుర్గగుడి పాలకమండలి కొలువు దీరింది. ఆలయానికి అవసరమైన నిధులను దాతల సహకారంతో తీసుకురావడం, భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం.. ఈ రెండు ప్రధానంగా ధర్మకర్తల మండలి చేయాలి. ఈ రెండు అంశాల్లోనూ పాలకమండలి ముద్ర వేయలేకపోయింది. 2020 దసరా సమయంలో కొండ రాళ్లు జారి పడి పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ సందర్శించి.. రూ.70 కోట్లను ఆలయ అభివృద్ధి కోసం ప్రకటించారు. 2021 దసరాలోపు ఈ నిధులతో ఆలయ అభివృద్ధి పనులు చాలావరకు పూర్తిచేస్తామని పాలకమండలి ప్రకటించింది. చేపట్టోబయే పనుల నమూనాలు కూడా ఘనంగా ప్రదర్శించారు. కానీ.. 2021 దసరాలోపు ప్రభుత్వం ప్రకటించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆ దిశగా పాలకమండలి సభ్యులు చొరవచూపించలేదన్న విమర్శలున్నాయి.