Woman Suicide for Blouse : హైదరాబాద్ అంబర్పేట్ గోల్నాకలోని తిరుమలనగర్‌కు చెందిన విజయలక్ష్మి(40)-శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు పిల్లలు. బతుకుతెరువు నిమిత్తం ఏపీలోని కడప నుంచి వచ్చిన ఈ కుటుంబం ఉన్నంతలో సంతోషంగా జీవిస్తోంది. శ్రీనివాస్ టైలరింగ్ పని చేస్తుంటాడు. ద్విచక్రవాహనంపై తిరుగి చీరలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంతలో భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న తగాదా.. ఆ పిల్లల్ని తల్లిలేని వాళ్లను చేసింది. క్షణికావేశంలో విజయలక్ష్మి తీసుకున్న నిర్ణయం ఆమె భర్తను ఒంటరివాణ్ని చేసింది.
Woman Suicide for Blouse : భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని.. భార్య దారుణం! - బ్లౌజ్ నచ్చలేదని మహిళ ఆత్మహత్య
Woman Suicide for Blouse : చిన్నచిన్న కారణాలతో.. క్షణికావేశంలో ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. చదువుకునే పిల్లల నుంచి మొదలుకొని కాటికి కాలుచాచిన వృద్ధుల వరకూ.. ఏదో ఒక కారణంతో బలవంతంగా తనువు చాలిస్తున్నారు. ఇదేవిధంగా.. ఓ చిన్న కారణంతో హైదరాబాద్‌కు చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చకపోవడంతో జరిగిన చిన్న వాగ్వాదంతో మనస్తాపం చెంది ఉరేసుకుంది.
అసలేం గొడవ జరిగిందంటే..
Woman Suicide for Blouse in Hyderabad : ఈనెల 4న శ్రీనివాస్ తన భార్య విజయలక్ష్మి కోసం ఓ బ్లౌజ్ కుట్టాడు. ఆ జాకెట్ భార్య విజలక్ష్మికి నచ్చక భర్తపై అరిచింది. చిరాకు పడిన శ్రీనివాస్ 'నచ్చకపోతే నీ జాకెట్ నువ్వే కుట్టుకో' అని చెప్పి విసురుగా అక్కడి నుంచి బయటకు వెళ్లాడు. భర్త మాటలకు మనస్తాపానికి గురైన విజయలక్ష్మి.. బెడ్రూంలోకి వెళ్లి తలుపులు మూసింది. కాగా పాఠశాలకు పోయిన పిల్లలు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి తమ తల్లి బెడ్రూంలో తలుపు మూసుకుని ఉండటం చూశారు. తలుపు తట్టినా ఆమె గడియ తీయలేదు. ఈలోగా బయటకు వెళ్లిన శ్రీనివాస్.. ఇంటికి వచ్చాడు. పిల్లలు తమ తండ్రితో తల్లి తలుపు తీయలేదని చెప్పగా.. అతను తలుపు గట్టిగా బాదాడు. ఎంతకీ తీయకపోవడంతో పగులగొట్టి లోపలికి వెళ్లాడు.
తీరా చూస్తే విజయలక్ష్మి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతుండటం చూసి షాకయ్యాడు. వెంటనే ఆమెను కిందకు దించాడు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. చిన్న గొడవకే ఇంత దారుణానికి ఒడిగడుతుందని అనుకోలేదని శ్రీనివాస్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఉదయాన ఎంతో ఆనందంగా ఉన్న తల్లి మధ్యాహ్నానికి విగత జీవిగా పడి ఉండటం చూసిన పిల్లలు మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.