విజయవాడ నగరంలోని కాటూరువారి వీధిలో రాజుసింగ్‌చరణ్ రెండేళ్లుగా సాయిచరణ్ నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో వ్యాపారం జరగకపోవడంతో 19 కిలోల వెండి, రూ.20 లక్షల నగదును దుకాణంలోనే ఉంచాడు. తన స్నేహితుడైన మరో నగల వ్యాపారి మనోహర్‌సింగ్ రాథోర్‌కు సంబంధించిన 7కిలోల బంగారం, రూ.22 లక్షల నగదునూ తన దుకాణంలోనే దాచారు.
పెద్దమొత్తంలో డబ్బు, బంగారం ఉండటంతో గురువారం రాత్రంతా దుకాణం వద్దనే ఉన్న యజమాని శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటికి వెళ్లాడు. తన వద్ద పనిచేసే గురుచరణ్‌సింగ్‌ను దుకాణం వద్దకు పంపించగా... అతనితోపాటే పనిచేసే విక్రంకుమార్ లోహార్ రక్తపు మడుగులో దుకాణంలో పడి ఉన్నాడు. అతని కాళ్లూ, చేతులు కట్టేసి ఉన్నాయి.
వెంటనే విషయాన్ని యజమాని రాజుసింగ్ చరణ్‌కు తెలిపారు. సంఘటన స్థలానికి పరుగున వచ్చిన యజమాని దుకాణాన్ని పరిశీలించి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి, క్లూస్‌టీంను పిలిపించి వేలిముద్రలతోపాటు ఇతర ఆధారాలను సేకరించారు. గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. లాక్‌డౌన్ కారణంగా షాపులో పనిచేసే సిబ్బంది స్వగ్రామానికి వెళ్లడంతో రాజుసింగ్.. 40 రోజుల క్రితం రాజస్థాన్‌కు చెందిన విక్రంకుమార్ లోహార్(23)ను పనికి కుదుర్చుకున్నారు.