కృష్ణమ్మ మహోగ్రరూపానికి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు కొనసాగుతున్నాయి. వరదలకు గుంటూరు జిల్లాలోని 14 మండలాల్లో 53 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. క్రోసూరు, అమరావతి, తుళ్లూరు, దుగ్గిరాల, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కొల్లూరు, కొల్లిపొర మండలాల్లోని 21 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల కరకట్లకు గండ్లు పడి... రహదారి సౌకర్యాలు మూసుకుపోయాయి. కొల్లిపొర మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్తున్న అధికారుల వాహనం వరద నీటిలో చిక్కుకుంది.
అమరావతి, తుళ్లూరు మండలాల్లోని రైతులకు వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. దాదాపు 12వేల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలలో నిమ్మ, జామ, కూరగాయల తోటలు చెరువులను తలపిస్తున్నాయి. దుగ్గిరాల నుంచి రేపల్లె వరకు కృష్ణా తీరం వెంట ఉన్న 21గ్రామాల్లో... పసుపు, కంద, అరటి పంటలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ఇప్పటికే దెబ్బతిన్న పంటలు... ఇంకా నీటిలో నానితే కోలుకోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున వీలైనంత ఎక్కువగా నష్ట పరిహారం అందించేలా కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రబ్బరు బోట్ల సాయంతో మంచినీరు, ఆహారం సరఫరా చేస్తున్నారు. ఆహారం వద్దన్న చోట్ల బియ్యం అందజేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 15పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 3వేల 500మందికి వాటిలో ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. 32చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పలు గ్రామాల్లో విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరిచినట్లు వివరించారు.