Registration: రాష్ట్రంలో వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) అమర్చుకోవడం తప్పనిసరి చేయడంపై.. రవాణాశాఖ దృష్టి సారించింది. మూడు నెలల్లో వీటిని బిగించుకోకపోతే, ఆ తర్వాత రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించనుంది. ఇప్పటివరకు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండగా, ఇకపై కచ్చితంగా నిబంధనలు అమలు చేయాలంటూ రవాణాశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తాజాగా ఆదేశాలిచ్చారు. దీంతో 2015 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన అన్ని వాహనాల యజమానులకు రవాణాశాఖ అధికారుల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి.
వాహనానికి హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేకపోతే, ఆ మెసేజ్‌లో ఉండే లింక్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులో రూ.400 ఫీజు డిజిటల్ విధానంలో చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ప్లేట్ ఏ రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి అమర్చుకుంటారో ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత నాలుగైదు రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్లేట్ సంబంధిత రవాణాశాఖ కార్యాలయంలో సిద్ధంగా ఉంటుంది. వాహనదారుడు వెళ్లి, అక్కడే వాహనానికి అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. మూడు నెలల వరకు వాహనదారులందరికీ మెసేజ్‌లు పంపుతామని, తర్వాత తనిఖీలు చేపట్టి జరిమానాలు వేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఫీజు చెల్లించినా ప్లేట్‌పై నిరాసక్తి..హెచ్‌ఎస్‌ఆర్‌పీలను కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) 2009 నుంచి అమలుచేయగా, మన రాష్ట్రంలో వీటిపై 2013 చివర్లో ఆదేశాలిచ్చారు. 2015-19 మధ్య కొనుగోలు చేసిన వాహనాలకు ఈ ఫలకాలు తయారుచేసి, అమర్చే బాధ్యత లింక్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. రవాణాశాఖ కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబరు ప్రకారం ఫలకాల కోసం వాహనదారులు డబ్బులు చెల్లించినప్పటికీ, అవి తయారయ్యాక కొందరు తీసుకోవడం లేదు. బయట ఇతర ప్లేట్లు అమర్చుకుంటున్నారు.